Akhil Akkineni | ఘనమైన వారసత్వం సులభంగా సినిమా అవకాశాల్ని తెచ్చిపెడుతుందేమో కానీ, విజయాలు దక్కాలంటే మాత్రం స్వీయ ప్రతిభనే నమ్ముకోవాలి. కొత్తదారుల్లో పయనించాలి. తానూ ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నానని చెబుతున్నారు యువ హీరో అక్కినేని అఖిల్. తొమ్మిదేండ్ల వెండితెర ప్రయాణం తనలో ఎంతో పరిణతిని తీసుకొచ్చిందని, కథల ఎంపికలో స్పష్టత వచ్చిందనీ చెప్పారు. అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన తాజాచిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని పంచుకున్న ముచ్చట్లు..
ఫస్ట్ లాక్డౌన్ టైమ్‌లో దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ కథ చెప్పారు. ఆ సమయానికి నేను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పూర్తిచేశాను. అది నా మనసుకు నచ్చిన ప్రేమకథా చిత్రమైనా, ఎక్కడో చిన్న అసంతృప్తి ఉండేది. స్వతహాగా నాకు యాక్షన్ చిత్రాలంటే ఇష్టం. భారీ యాక్షన్ డ్రామా చేస్తే బాగుంటుందని ఎప్పటినుంచో అనుకుంటున్నా. సరిగ్గా అదే సమయంలో సురేందర్ రెడ్డి కలవడం.. ఈ కథ చెప్పడంతో ప్రాజెక్ట్ ఓకే అయింది.
కెరీర్లో మనకంటూ ఓ ప్రత్యేకత సాధించుకోవాలంటే కొత్తదారుల్ని ఎంచుకోవాలి. రిస్క్ చేయడం తప్ప మారో మార్గం లేదు. అందుకే స్పై యాక్షన్ కథ ఎంచుకున్నా. ఈ సినిమా ద్వారా నటుడిగా నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశం దక్కింది. సినిమా చూశాక
ప్రేక్షకులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు.
ప్రస్తుతం ప్రేక్షకులకు ఓటీటీలో విస్తృతమైన కంటెంట్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉంది. వారిని థియేటర్‌కు రప్పించాలంటే అంతకు మించిన కొత్త ఎక్స్పీరియన్స్ అందించగలగాలి. ప్రస్తుతం నేను ఆ ప్రయత్నాల్లో ఉన్నా. ఇమేజ్ కంటే.. నటుడిగా నాలోని ప్రతిభను ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నా. సినిమా కోసం ఎంత కష్టానికైనా సిద్ధంగా ఉన్నా. ఒక్కో చిత్రానికి ఏడాది సమయం తీసుకున్నా పర్లేదు. క్వాలిటీలో మాత్రం రాజీపడొద్దని నిర్ణయించుకున్నా.
దర్శకుడు సూరి చెప్పినట్టే నాలుగు నెలల్లోనే సిక్స్‌ప్యాక్‌తో సిద్ధం కావాలని అనుకున్నా. కానీ దాదాపు పది నెలలు పట్టింది. ‘గతంలో నీ ఫిజికల్ అప్పియరన్స్ ఎలా ఉండేదో ప్రేక్షకులు మర్చిపోవాలి. తెరపై కొత్త అఖిల్‌ను చూస్తున్నామనే ఫీలింగ్ రావాలి. అందుకు చాలా తీవ్రంగా శ్రమించాలి’ అని సురేందర్‌రెడ్డి నన్ను ఎంకరేజ్ చేశారు. ఆయన కోరుకున్న విధంగానే తెరపై కనిపించాను.
స్వతహాగా నాకు మొహమాటం ఎక్కువ. చాలా సిగ్గరిని కూడా. ‘ఏజెంట్’లో మాత్రం తన అల్లరితో అందరినీ ఆటపట్టించే క్యారెక్టర్ నాది. ఈ పాత్ర కోసం నాలోని భయాల్ని, బలహీనతల్ని వదిలించుకున్నాను. నటుడిగా ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాను.
‘ఏజెంట్’ హీరో కేంద్రంగానే నడిచే కథ కాదు. ఈ గూఢచారి కథలో కావాల్సినంత డ్రామా ఉంటుంది. కథాగమనంలో ప్రతీ పాత్ర కీలకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మూడు ప్రధాన పాత్రల మధ్య జరిగే సంఘర్షణ హృదయాల్ని కదిలిస్తుంది. మమ్ముట్టి వంటి సూపర్‌స్టార్ ఈ సినిమాలో నటించారంటేనే.. కథాపరంగా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మమ్ముట్టి ఇతర భాషా చిత్రాల్లో తక్కువగా నటిస్తారు. తన స్థాయికి తగిన పాత్ర లభిస్తేనే అంగీకరిస్తారు. ఆయన వల్ల సినిమాకు భారీతనం వచ్చింది.
ఈ సినిమాలో హీరో పాత్రపేరు రామకృష్ణ. అందరూ రికీ అని పిలుస్తుంటారు. తాను మాత్రం ‘ఏజెంట్ వైల్డ్’ అనే చెప్పుకొంటూ ఉంటాడు. రికీ ప్రవర్తన, పనులు అనూహ్యంగా ఉంటాయి. స్పై ప్రపంచంలోకి కోతిలాంటి కుర్రాడు ఎంటరైతే.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అతనికి అప్పగించిన ఆపరేషన్ ఏమిటి? అనే అంశాలు సినిమాలో ఉత్కంఠను పంచుతాయి. గూఢచారి చిత్రాల్లో యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ‘ఏజెంట్’లో అదనంగా కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది.
ఈ సినిమా షూటింగ్ బుడాపెస్ట్‌లో జరుగుతున్నప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. అక్కడి షెడ్యూల్ క్సాన్సిల్ చేసుకొని యూనిట్ మొత్తం ఇండియాకు తిరిగొచ్చింది. బుడాపెస్ట్‌లో ఆస్పత్రులన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. అప్పుడున్న భయానక పరిస్థితుల్లో సురేందర్ రెడ్డి కూడా వందల మంది వున్న కొవిడ్ వార్డ్‌లోనే చికిత్స తీసుకున్నారు. ఆయన చుట్టూ ఉన్న వారిలో చాలామంది చనిపోయారు. ఆ సమయంలో సురేందర్ రెడ్డి నాకు ఓ వీడియో పంపుతూ..‘నేను ఉంటానో పోతానో అర్థం కావట్లేదు, నా పక్కన డెడ్ బాడీ ఉంది’ అని ఉద్వేగానికి లోనయ్యారు. కొవిడ్ నుంచి కోలుకోవడానికి ఆయనకు మూడు నెలల సమయం పట్టింది.
అలాంటిదేమీ లేదు. నాన్నకు కూడా కథ మొత్తం తెలియదు. కథలోని కొన్ని ఎపిసోడ్స్ గురించి మాత్రమే చెప్పాను. వ్యక్తిగత జీవితం మొదలుకొని కెరీర్ వరకు నేను సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటా. జయాపజయాలకు నేనే పూర్తి బాధ్యత వహిస్తాను. నా విషయంలో ఇతురులెవరూ నాన్నను నిందించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సినీ వారసత్వం అనే నీడ నుంచి బయటపడి సొంతంగా ఇమేజ్ను సృష్టించుకోవాలన్నదే నా సిద్ధాంతం. అది తప్పో ఒప్పో కూడా నాకు తెలియదు. కానీ నేను ఎంచుకున్న మార్గం మాత్రం అదే. కెరీర్ ఆసాంతం ఫ్యామిలీ లెగసీ మీద ఆధాపడలేం కదా? మన దారుల్ని మనమే సిద్ధం చేసుకోవాలి. అయితే వృత్తిపరంగా ఏమైనా సందేహాలుంటే మాత్రం నాన్నతో చర్చించి సలహాలు తీసుకుంటా. కథల ఎంపికలో మాత్రం ఆయన ప్రమేయం ఏమీ ఉండదు.
మా ఇద్దరి మధ్యా సినిమా చర్చలే ఎక్కువగా ఉంటాయి. అన్నయ్యను మూవీ ఫ్యాక్టరీగా అభివర్ణించొచ్చు. అద్భుతమైన సినిమా పరిజ్ఞానం తన సొంతం. అయితే వృత్తిపరంగా ఇద్దరం బిజీగా ఉంటాం కాబట్టి, పర్సనల్‌గా కలుసుకోవడం చాలా తక్కువే. రోజూ ఫోన్లో మాత్రం టచ్‌లో ఉంటాం.
నాన్నతో కలిసి నటించాలన్నది నా జీవితంలో బిగ్గెస్ట్ డ్రీమ్. అందుకు గొప్ప కథ కుదరాలి. మేమిద్దరం సినిమా చేస్తే అదొక జీవితకాల అనుభవంలా మిగిలిపోవాలి. ఆ రోజు కోసమే నేను ఎదురుచూస్తున్నా. అయితే వందో సినిమా విషయంలో నాన్న ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ సినిమా కన్ఫర్మ్ అయితే నేనే ముందుగా ఆ విషయం చెబుతాను.
…? కళాధర్ రావు జూలపల్లి
– సి.ఎం.ప్రవీణ్‌కుమార్