పోలీస్ అంటే మహా క్రేజీ..
పోలీస్ డ్రెస్ వేసుకోవడమంటే కొందరికి మహా క్రేజీ.. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసితో నిరుద్యోగ అభ్యర్థులు మైదానంలో శిక్షణను ప్రారంభించారు. ప్రభుత్వం భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమవడంతో ఇంటర్, డిగ్రీ చేసిన యువతి, యువకులు ఎక్కువగా పోలీస్ కొలువు సాధించడం కోసమే సిద్ధమవుతున్నారు. ఉచిత శిక్షణ శిబిరాల ద్వారా యువతను ఉద్యోగాలకు సన్నద్ధం చేయాలనే ఉద్దేశంతో జిల్లాలో అర్హులైన వారికి రాతపరీక్ష నిర్వహించి ఉచిత శిక్షణకు ఎంపిక చేశారు. జిల్లాలో గజ్వేల్, సిద్దిపేట, హుస్నాబాద్ పట్టణాల్లో 15రోజులుగా నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ శిక్షణ కొనసాగుతుండగా, ఎస్సై, సీఐలు ప్రతిరోజూ అక్కడే ఉండి శిక్షణను పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ అభ్యర్థులు మే 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
గజ్వేల్ రూరల్, మే 6 : తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ముందుగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి గత వారం నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో యువతి, యువకులు ఎంతో ఉత్సాహంతో ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా చదువుకుంటున్నారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతో జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఉచిత పోలీస్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ కోసం అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ సాధించిన వారిని ఎంపిక చేశారు. సుమారు 70 రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణలో పాల్గొంటున్న అభ్యర్థులకు రోజు మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. జిల్లాలోని శిక్షణ కేంద్రాలను ఎప్పటికప్పుడు సీపీ శ్వేత, ఏసీపీలు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాను యూనిట్‌గా చేసి ఖాళీలను ప్రభుత్వం ప్రకటించడంతో పోలీస్ ఉదోగ్యాల కోసం పోటీతత్వం పెరిగింది. జిల్లాలో ఉచిత శిక్షణ ద్వారా ఉద్యోగాలకు అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు తర్ఫీదు ఇవ్వడంతో నిరుద్యోగుల్లో హార్షం వ్యక్తం అవుతుంది.
ఉచిత భోజన సదుపాయం..
పోలీస్ శిక్షణలో పాల్గొంటున్న అభ్యర్థులకు మధ్యాహ్నం సమయంలో ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. నాణ్యమైన భోజనంను అందించడంతో పాటు అభ్యర్థులకు శిక్షణ కేంద్రంలో అన్ని వసతులు అందుబాటులో ఉంచారు. ప్రతి రోజు వివిధ రకాల వంటకాలతో భోజనం పెడుతున్నారు. ఉచిత శిక్షణ ఇవ్వడంతో అభ్యర్థులు ఎంతో ఉత్సాహంతో రోజు శిక్షణకు హాజరవుతున్నారు. అభ్యర్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసి రోజు వారీగా ఎలా చదువుకొవాలో ప్రణాళికను తెలియజేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 1162 మంది అభ్యర్థులు
జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో 1162 మంది ఉండగా, ఇందులో సిద్దిపేటలోని బీజేఆర్ భవన్ 1, బీజేఆర్ భవన్ 2, నంగునూర్ మండల పరిధిలోని రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాల, గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో 15 రోజులుగా శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ సుమారుగా 70 రోజుల పాటు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో కొనసాగుతున్నది. అభ్యర్థులకు శిక్షణ అనంతరం స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నారు. ఈ శిక్షణకు యువతి, యువకులు ఉంతో ఉత్సాహంతో పోటాపోటీగా హాజరవుతున్నారు. శిక్షణ పర్యవేక్షణ బాధ్యతలను ఆయా డివిజన్ల ఏసీపీలు చేపడుతున్నారు.
ఆర్అండ్ఆర్ కాలనీ అభ్యర్థులకు..
మల్లన్నసాగర్ జలాశయ నిర్వాసిత గ్రామాల నిరుద్యోగుల కోసం సీపీ శ్వేత ప్రత్యేక చొరవతో గజ్వేల్‌లోని బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లో ఉచిత పోలీస్ శిక్షణను ఇస్తున్నారు. ఈ శిక్షణకు ప్రతి రోజు 80మంది వరకు అభ్యర్థులు హాజరవుతుండగా, వీరికి కూడా ఉచిత భోజన సదుపాయం, నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలోని ఎనిమిది గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువతి, యువకులు ఈ శిక్షణను సద్వినియోగం చేసకుంటున్నారు. ఈ శిక్షణ కేంద్రాన్ని గజ్వేల్ ఏసీపీ రమేశ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి పలు సూచనలు చేస్తున్నారు.
దేహదారుఢ్యం, రాత పరీక్షలపై తర్ఫీదు..
ఉచిత పోలీస్ శిక్షణలో అభ్యర్థులకు రాత పరీక్షపై ప్రతి రోజు పలు సబ్జెక్టులపై బోధన చేపడుతున్నారు. పోటీ పరీక్షలో వచ్చే అంశాలన్నింటిని నివృత్తి చేసి పరీక్షకు సన్నద్ధం చేస్తున్నారు. అదే విధంగా ఉదయం సమయంలో అభ్యర్థులకు దేహదారుఢ్య శిక్షణను పీఈటీ, పీడీలతో ప్రత్యేక ఇప్పిస్తున్నారు. ప్రధానంగా మహిళా అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు శారీరకంగా వారిని సన్నద్ధం చేస్తున్నారు. రన్నింగ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, 1600 మీటర్ల పరుగుపందెంలో నిష్ణాతులుగా తయారు చేస్తున్నారు. ప్రాథమిక పరీక్ష ఎప్పుడు పెట్టిన సిద్ధంగా ఉండేలా చదువుకునే వెసలుబాటు కల్పిస్తున్నారు.
ఉచిత శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంది
పోలీస్ ఉచిత శిక్షణ మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. శిక్షణలో చాలా వరకు తెలియని అంశాలను తెలుసుకుంటున్నాం. మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం డివిజన్ పరిధిలోని నిరుద్యోగులకు ఎంతో లాభం చేకూరుస్తున్నది. తప్పకుండా ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతోనే చాలా మంది ఉన్నాం. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన పోలీస్ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. – నరేశ్, అభ్యర్థి. గజ్వేల్
పోలీస్ అవడమే లక్ష్యం
పోలీస్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చదువుకుంటున్నా. ఉచిత శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతున్నది. ప్రతి రోజూ నిపుణులైన అధ్యాపకులు వివిధ అంశాలపై శిక్షణనిస్తూ, రోజు వారీగా నోట్స్ ఇస్తున్నారు. ఈ నోట్స్‌ను రోజూ చదువుకుంటూ, సందేహాలుంటే ఒకరికొకరం అడిగి తెలుసుకుంటున్నాం. ఏమైనా సందేహాలుంటే అధ్యాపకులను అడుగుతున్నాం. పోలీస్‌లు అందిస్తున్న సహకారం మరిచిపోలేనిది. – నవీన్, అభ్యర్థి, గజ్వేల్
70 రోజుల పాటు ఉచిత శిక్షణ
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యం లో 70 రోజుల శిక్షణనిస్తున్నాం. స్టడీ మెటీరియల్‌ను అందజేస్తాం. అనుభవజ్ఞులైన వారితో అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాం. ఎప్పటికప్పుడు శిక్షణ కేంద్రాలను పర్యవేక్షిస్తూ, వారి సందేహాలను తీర్చుతూ సలహాలు ఇస్తున్నాం. – ఎం. రమేశ్, ఏసీపీ, గజ్వేల్