శివ్వంపేట, మే 5 : శివ్వంపేట మండల పరిధిలోని చిన్నగొట్టిముక్ల గ్రామంలో అంగన్వాడీ సెంటర్ సరుకులను దారి మళ్లించడంపై గ్రామస్తులు భగ్గుమన్నారు. స్థానిక అంగన్వాడీ టీచర్ సెంటర్‌కు కేటాయించిన గుడ్లు, పాలు, పప్పులు, నూనె, ఇతర పోషకాహార సరుకులను మంగళవారం తన కారులో తీసుకెళ్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇవ్వాల్సిన సరుకులను కాజేయడం.. చెప్పాపెట్టకుండా తరలించడం ఎంతవరకు సమంజసం? అని గ్రామస్తులు టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిధులతో అందిస్తున్న పోషకాహారాన్ని అర్హులైన పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు సరైన విధంగా పంపిణీ చేయకపోవడం దారుణమని ఆ సందర్భంగా గ్రామస్తులు వాపోయారు. లబ్దిదారులు సరుకులకోసం అడిగినప్పుడు ఆన్లైన్ పనిచేయడం లేదని, సర్వర్ డౌన్ ఉంది.. ఇలా రోజుకొక సాకు చెబుతూ అంగన్వాడీ టీచర్ ఎవరికీ ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.