మద్దూరు(ధూళిమిట్ట) ఆగస్టు 25 : సిద్దిపేట జిల్లాలోని బైరాన్పల్లి గ్రామానికి ఘనమైన పోరాట చరిత్ర ఉంది. రజాకార్లపై తిరుగుబాటు చేసిన పోరుబిడ్డలు ఈ గ్రామస్తులు. హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనం అయ్యేందుకు బైరాన్పల్లి సంఘటన ఓ కారణమని చరిత్రకారులు తెలుపుతున్నారు. ఈ గ్రామానికి ఉన్న చారిత్రక నేపథ్యం మరే గ్రామానికి లేదనడంలో సందేహం లేదు. జలియన్ వాలాబాగ్ను మించిన నరమేధం ఈ గ్రామంలో జరిగింది. ఒకేరోజు 92 మంది గ్రామస్తులను రజాకార్లు పొట్టన పెట్టుకున్నారు. నాటి మారణకాండకు గ్రామం నడిబొడ్డులో ఉన్న బురుజు సాక్షీభూతంగా దర్శనమిస్తున్నది.
రజాకార్లను ఎదురించేందుకు బైరాన్పల్లి గ్రామంలోని యువకులంతా కలిసి గ్రామ రక్షక దళంగా ఏర్పడ్డారు. ఒకరోజు రజాకార్లు గ్రామానికి సమీపంలో ఉన్న ధూళిమిట్ట, లింగాపూర్ గ్రామాలను రజాకార్లు దోచుకున్నారు. దోచుకున్న సొత్తుతో బైరాన్పల్లి మీదుగా తిరుగు ప్రయాణం అయ్యారు. దీనిని గమనించిన గ్రామరక్షక దళాలు రజాకార్లకు అడ్డు తిరిగి వారి వద్ద నుంచి సొమ్మును స్వాధీనం చేసుకొని హెచ్చరికలు జారీచేసి రజాకార్లను వదిలిపెట్టారు. దీంతో గ్రామంపై కక్ష పెట్టుకున్న రజాకారు మూకలు గ్రామంపై ఐదుసార్లు దాడి చేసి విఫలమయ్యారు. ఈ దాడుల్లో 20మందికి పైగా రజాకార్లు మృతిచెందారు. దీంతో అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హసీం బైరాన్పల్లి గ్రామాన్ని తిరుగుబాటు గ్రామంగా ప్రకటించి, ఏ రోజైన గ్రామాన్ని నేల కూలుస్తానని ప్రతిన బూనాడు. రజాకార్లు ఏదో ఒక రోజు గ్రామంపై దాడిచేసే అవకాశం ఉందని భావించిన గ్రామస్తులు, గ్రామం చుట్టూ కోట గోడ నిర్మించుకొని మధ్యలో ఎతైన బురుజును నిర్మించుకొని దానిని రక్షణ కేంద్రంగా మలుచుకున్నారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే బురుజుపైన ఉన్న గ్రామ రక్షక దళ సభ్యులు నగారా మోగించేవారు.
1948 ఆగస్టు 27న వేకువజామున గ్రామంలో తుపాకీ మోతలు వినిపించాయి. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకారు సైన్యం ప్రతీకారం తీర్చుకునేందుకు 1200 మంది బలగంతో భారీ మందు గుండు సామగ్రి, తుపాకులు, తోపులతో దొంగచాటున గ్రామ పొలిమేర్లకు చేరుకున్నారు. గ్రామ పొలిమేర్లలో కాపలాగా ఉండి రజాకార్ల కదలికలను గ్రామ రక్షక దళాలకు అందించే విశ్వనాథ్భట్ జోషిని రజాకార్లు పట్టుకొని బంధించారు. తెల్లవారుజామున బహిర్భూమికి వచ్చిన ఉల్లెంగల వెంకటనర్సయ్యను రజాకార్లు పట్టుకోగా, వారి నుంచి తప్పించుకుని గ్రామాన్ని చేరుకుని రజాకార్లు గ్రామంలో చొరబడ్డారు అని కేకలు వేసి గ్రామస్తులను అప్రమత్తం చేశాడు. గ్రామానికి రక్షణ కేంద్రంగా ఉన్న బరుజు పైనున్న దళ కమాండర్ రాజిరెడ్డి ప్రజలంతా రక్షణలోకి వెళ్లేందుకు నగారా మోగించాడు. బురుజుపై కాపలాగా ఉన్న మోటం రామయ్య, మోటం పోచయ్య, బలిజ భూమయ్య నిద్రమత్తు వదిలించుకునే లోపుగానే రజాకార్ల తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఫిరంగుల నుంచి వచ్చి పడిన నిప్పురవ్వలతో బురుజుపై నిల్వచేసిన మందుగుండు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్లుగా మట్టుపెట్టారు. అంతటితో ఆగకుండా రజాకార్లు ఇంటింటికీ తిరిగి 92మందిని పట్టుకొని పెడరెక్కలు విరిచి, జోడుగా లెంకలు కట్టి వరుసగా నిలబెట్టి కాల్చి చంపి వారి రక్తదాహాన్ని తీర్చుకున్నారు. గ్రామం వెలుపల శవాల చుట్టూ మహిళలను వివస్త్రలు చేసి బతుకమ్మ ఆడించారు. ఈ దాడుల్లో 118మంది అమాయకులు బలికాగా, 25 మంది రజాకార్లు చనిపోయినట్లు రికార్డుల్లో ఉంది. బైరాన్పల్లితో పాటు కూటిగల్ గ్రామంలో రజాకార్లు దాడులు చేసి 30మందిని పొట్టన పెట్టుకున్నారు. బైరాన్పల్లి పోరాట స్ఫూర్తితో హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. భారత సర్కార్ నిజాం ప్రభుత్వంపై సైనిక చర్యకు దిగేందుకు సిద్ధ్దం కాగా, నిజాం ప్రభువు దిగివచ్చి భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన తొలి, మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన బైరాన్పల్లి పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని, గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రజాకార్ల దాడి జరిగినప్పుడు నేను పదిహేనేండ్లు ఉన్న. రజాకార్లు ఊరిలో దొరినోల్లను దొరికినట్లు కట్టేసి సంపిండ్రు. మేము భయపడి ఊళ్లే ఉన్న ఓ కుంట దగ్గరికి పోయి దాక్కున్నం. మూడు రోజులు ఎవలికంట్ల కనబడకుండా కుంట్లనీళ్లే తాగినం. బురద మట్టినే తిన్నం. అప్పటి దాడిని యాది చేసుకుంటనే ఇంకా భయమైతనే ఉంటది. దాడి అయినంక ఊర్లే ఎటూచూసిన పీనుగులు పడి ఉన్నయి. నెత్తరు కాల్వలై పారింది. – రాధమ్మ, ప్రత్యక్ష సాక్షి
రజాకారులు ఊరిమిద పడి దొరికినోళ్లను దొరికినట్లుగా చంపి ఊరిని వల్లకాడు చేసిండ్రు. లెంకలుగా గట్టి తుపాకులతో ఎంతోమందిని చంపిండ్రు. ఆడవాళ్లను, పిల్లలని చూడకుండా చిత్రహింసలు పెట్టిండ్రు. ఆడవాళ్లతోటి బరిబాతల బతుకమ్మలను ఆడించిండ్రు. ఊర్లే ఎటుచూసినా నెత్తురు డొల్లారింది. కొంతమంది రజాకార్ల భయానికి ఊరొదిలి సుట్టాల దగ్గరికి పోయి దాక్కున్నరు.
– చల్లా చంద్రారెడ్డి, సమరయోధుడు
మా ఊరిలో జరిగినట్లు దేశంలో ఇంతపెద్ద దాడి ఎక్కడా జరగలేదు. రజాకార్ల దాడిలో ఎంతోమంది ఊరోళ్లు చనిపోయిండ్రు. బైరాన్పల్లి పోరాటాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. అమరుల త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా గ్రామంలో అమరవీరుల స్మృతివనాన్ని నిర్మించాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు తాము అధికారంలోకి వస్తే బైరాన్పల్లిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డితో సహా పలువురు బీజేపీ నాయకులు హామీనిచ్చినా ఇప్పటికి దానిని నెరవేర్చడం లేదు.
– నారదాసు రమేశ్, గ్రామస్తుడు