హత్నూర : ఆ ప్రయాణ ప్రాంగణంలోకి వెళ్లే దారి పూర్తిగా గుంతలుపడి వర్షం నీళ్లు చేరి చిత్తడి చిత్తడిగా మారింది. ప్రయాణికులు ఆరోడ్డు పై వెళ్లాలంటే జంకుతున్నారు. మెదక్ జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్-కాసాల ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ( RTC Bus Stand ) లోకి నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా ప్రయాణికులను చేరవేయడానికి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రయాణికులను దించడానికి, తీసుకెళ్లడానికి ప్రైవేట్ వాహనాలు వస్తూ పోతుంటాయి.
దౌల్తాబాద్ -కాసాల ప్రయాణం ప్రాంగణం ప్రధానకూడలి కావడంతో సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, జోగిపేట, పటాన్ చెరువు, హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణికులు నిత్యం ప్రయాణ ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ ప్రయాణ ప్రాంగణంలోకి వెళ్లే ప్రధాన దారి పూర్తిగా చెడిపోయి నిత్యం ప్రయాణికులు, ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు. లోపలికి వెళ్లే దారి పూర్తిగా గుంతల మయంగా మారడంతో నిత్యం కురుస్తున్న వర్షాలకు నీళ్లు చేరి రోడ్డు చెడిపోయింది. ప్రయాణికులు అడుగు తీసి అడుగు వేయాలంటేనే జంకుతున్నారు .
ప్రయాణికుల పరిస్థితి ఒకలా ఉంటే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు సైతం ప్రయాణ ప్రాంగణంలోకి వెళ్లడానికి ఇబ్బందులు తప్పడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. భారీగా ఏర్పడ్డ గుంతలతో వాహనాలు చెడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రయాణ ప్రాంగణంలోకి వెళ్లే దారికి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు, డ్రైవర్లు కోరుతున్నారు.