అక్కన్నపేట, జూలై 31 : మండల కేంద్రంలోని రెవెన్యూ, ఎంపీడీవో కార్యాలయాల్లో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. బుధవారం తహసీల్ కార్యాలయానికి తహసీల్దార్ సహా సీనియర్ అసిస్టెంట్, ఆర్- 1, ఆర్ఐ-2, రికార్డ్ అసిస్టెంట్, మరో ఒక్కరిద్దరూ ఉద్యోగులు ఉదయం 11 గంటల వరకు కూడా రాలేదు. ఇదే విషయంపై తహసీల్దార్ అనంతరెడ్డిని వివరణ కోరగా, తాను హుస్నాబాద్ ఆర్డీవో ఆఫీసులో ఉన్నానని, ఆర్ -1 జ్వరంతో ఉన్నాడని, మరో ఆర్ఐ -2, సీనియర్ అసిస్టెంట్, ఒక్కరిద్దరూ ఉద్యోగులకు మాత్రం ఈ రోజు ఆలస్యమైందన్నారు. ఇదిలా ఉంటే మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జయరామ్ సహా ఎంపీవో రవికుమార్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ పదకొండు గంటలు దాటినా విధులకు హాజరుకాలేదు.
గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులు ఉన్నా మండల పరిషత్ ఉద్యోగులు ఇదే అదునుగా భావించి సమయ పాలన పాటించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కోసారి ఇటు మండల పరిషత్ కార్యాలయం పేరు, ఒక్కోసారి అటు గ్రామ పంచాయతీల్లో ఉన్నామంటూ పొంతన లేకుండా సమాధానాలు చెప్పుతూ విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నా యి. ఇదే విషయంపై ఎంపీడీవో జయరామ్ ను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
కాంగ్రెస్ పాలనలో క్షేత్ర స్థాయిలో ఉన్న రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతుండటంపై మం డల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమయ పాలన పాటించని ఉద్యోగులపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.