ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు అందజేస్తున్నది. సోమవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా పటాన్చెరులో నిర్మించిన ఫ్రీడమ్ పార్కు, డీసీసీబీ నూతన భవనం, ఆర్అండ్బీ విశ్రాంతి భవనాలను మంత్రి ప్రారంభించనున్నారు. సంగారెడ్డి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం జహీరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాలులో 1127 మంది గిరిజనులు సాగు చేసుకుంటున్న 1808.07 ఎకరాల పోడు భూములకు సంబంధించి పట్టాలు అందజేయనున్నారు. సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. మంత్రి హరీశ్‌రావు పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమాల్లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, చంటి క్రాంతికిరణ్, గూడెం మహిపాల్‌రెడ్డి హ్యాండ్లూమ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొననున్నారు.
సంగారెడి, జూలై 9 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలోని పోడు రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల నెరవేరనున్నది. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం జిల్లాలోని 1127 మంది గిరిజనులకు పోడు భూ ముల పట్టాలను అందజేయనున్నారు. జహీరాబాద్, అందోలు నియోజవర్గంలోని 1127 మందికి జహీరాబాద్‌లో పోడు పట్టాలను మంత్రి హరీశ్‌రావు అందజేయనున్నారు. పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి సోమవారం మంత్రి హరీశ్‌రావు రానున్నారు.
మొదటగా పటాన్చెరు పట్టణంలో మంత్రి హరీశ్‌రావు పర్యటించనున్నారు. పటాన్చెరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కు, డీసీసీబీ కార్యాలయం ప్రారంభం, ఆర్‌ఆండ్‌బీ విశ్రాంతి భవనంతోపాటు ఇతర పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. మల్కాపూర్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సంగారెడ్డి మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులతో మంత్రి హరీశ్‌రావు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం సంగారెడ్డి నుంచి జహీరాబాద్ చేరుకుని అక్కడ పలు అభివృద్ధి పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు. పట్టణంలోని ఆటోనగర్‌లో ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తారు.
1127 మందికి పోడు పట్టాలు పంపిణీ
సంగారెడ్డి జిల్లాలో ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు గత ప్రభుత్వాలు పట్టా ఇవ్వలేదు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పోడు భూముల సమస్యలు పరిష్కరించి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి జిల్లాలో 1127 మందికి పట్టాలు అందజేయనున్నారు. జహీరాబాద్‌లోని ఓ ప్రైవేటు పంక్షన్ హాల్లో అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాలకు చెందిన 1127 మంది గిరిజనులు సాగు చేసుకుంటున్న 1808.07 ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలను మంత్రి హరీశ్‌రావు అందజేయనున్నారు.
ఝరాసంగం మండలంలో ఏడుగురికి 19 ఎకరాలు, జహీరాబాద్ మండలంలో 213మందికి 123.57 ఎకరాలకు సంబంధించి పట్టాలు అందజేయనున్నారు. కోహీర్ మండలంలో 168 మందికి 218.57 ఎకరాలు, మొగుడంపల్లి మండలంలోని 593 మందికి 1392.52 ఎకరాలు, వట్పల్లి మండలంలోని 145 మందికి 53.16 ఎకరాలు, చౌటకూరు మండలంలోని ఒక లబ్ధిదారుడికి 1.25 ఎకరాలకు సంబంధించి పట్టాలు ఇవ్వనున్నారు. మంత్రి కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొననున్నారు.
మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు, జూలై 9 : పట్టణంలో సోమవారం వివిధ అభివృద్ధి పనులకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శం కుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మంత్రిపర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి హాజరవుతున్నారు.
మంత్రి పర్యటనకు తరలిరావాలి..
సోమవారం ఉదయం 8:30 నుంచి మంత్రి హరీశ్‌రావు పటాన్చెరులో పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలను కోరారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి హరీశ్‌రావు సహకారంతో పటాన్చెరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు.