మెదక్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రేపటి నుంచి పక్షం రోజుల పాటు చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములై విజయవంతం చేయాలని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్‌గౌడ్ కోరారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో పల్లె, పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించినప్పుడే అసలైన ప్రగతి సాధించినట్లని భావించిన సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. నేడు పల్లెల్లో గుణాత్మక మార్పు వచ్చిందన్నారు. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగినప్పుడే పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తుందన్నారు.
ఆరోగ్యకరమైన తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో నిర్వహించిన ప్రగతి కార్యక్రమాలతో దేశంలో పదికి పది ర్యాంకులు సాధించామన్నారు. 2014కు పూర్వం గ్రామాల స్థితి, నేడు పల్లెల్లో ప్రగతి స్పష్టంగా తెలుస్తున్నదన్నారు.
వైకుంఠధామాలు, డంప్‌యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రా మాలు పచ్చదనం, పరిశుభ్రతతో పరిఢవిల్లుతున్నాయన్నారు. పల్లె ప్రగతి చేపట్టిన పనులకు ఎప్పటికప్పు డు రికార్డు చేసి. పేమెంట్ జాప్యం లేకుండా చూడాలని పంచాయతీరాజ్ అధికారులకు సూచించా రు. సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో పని చేసి పేరు తీసుకురావాలని సూచించారు.
ప్రతి పల్లెలో వైకుంఠధామం, డంప్‌యార్డు, నర్సరీ, ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందని మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. అల్లాదుర్గం, టేక్మాల్ వంటి మండలాల్లో కార్యక్రమాలు మెరుగుపడాల్సి ఉన్నదని, ఆ దిశగా మండల ప్రత్యేకాధికారులు, మండల పరిషత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలన్నారు. మండలాల వారీగా మంజూరైన పనులు, పూర్తయిన ప్రగతిలో ఉన్న పనుల సమగ్ర వివరాలు అందించాల్సిందిగా సూచించారు.
ఈ నెల 3 నుంచి 18 వరకు రోజువారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలను అధికారులు, ప్రజాప్రతినిధులకు వివరించారు. ప్రతి మండలంలో స్థలాలు గుర్తించి బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాల్లో మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో నర్సరీల సక్రమ నిర్వహణకు పంచాయతీ కార్యదర్శులను కేటాయించామని, వారి సేవలు వినియోగించుకోవాలని కమిషనర్లకు సూచించారు.
కార్యక్రమం తర్వాత 5 ఉత్తమ, 5 బాగాలేని పంచాయతీలను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్‌కుమార్, ఆర్డీవోలు సాయిరాం, శ్యాంప్రకాశ్, వెంకట ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.