గజ్వేల్, జూన్ 1 : రాష్ట్రంలో జరిగిన అద్భుత ప్రగతిని కేంద్రంలోని బీజేపీ సర్కారు జీర్ణించుకోలేకపోతున్నదని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. బుధవారం గజ్వేల్ సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటా రాష్ట్రం నుంచి కేంద్రానికి లక్ష కోట్లు పన్నుల రూపంలో చెల్లిస్తున్నా, తెలంగాణకు రావాల్సిన వాటా చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మం జూరు కోసం ప్రజాప్రతినిధులు సమైక్య ఆందోళనలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల ఎజెండాను సంపూర్ణంగా అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ నీళ్లు, నిధులు, ఉద్యోగాల భర్తీ చివరి దశకు చేరుకున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో లక్షా20వేల ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేయగా త్వరలోనే మరో 80వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేసినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంలో 25లక్షల ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పెద్దపీట వేసిన టీఆర్ఎస్ సర్కారు యాదవులు, గొల్లకురుమలు, గౌడన్నలు, ముదిరాజ్, గంగపుత్రులు తదితర వర్గాలను వివిధ రకాలుగా ప్రోత్సహించి ఆర్థికంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.
రాష్ట్రంలో చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలను బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అ మలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు, తంత్రాలు పన్నినా టీఆర్ఎస్ తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. ఈనెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందామని వివరించారు. కార్యక్రమంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ము న్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, టీఆర్ఎస్వీ ఉమ్మ డి మెదక్ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, కౌన్సిలర్ రహీం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు పాల్గొన్నారు.