సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవులు వచ్చేశాయి. ఇవి పిల్లలకు ఆనందాన్ని పంచే అద్భుత క్షణాలు. ఈ సెలవులను ఎలా వినియోగించుకోవాలనే ఆలోచనలో విద్యార్థులు ‘వాట్ నెక్స్’ అంటూ ప్రశ్నించుకుంటారు. ఇదే క్రమంలో తల్లిదండ్రులూ ఈ సెలవులను ఎలా పిల్లలకు ఉపయోగకరంగా మలచాలనే ఆలోచనలు చేస్తారు. అయితే ఈ సెలవులను వృథా చేయకుండా అటు ఆటవిడుపును.. ఇటు విజ్ఞానాన్ని పంచే కొన్ని ఆన్లైన్ శిక్షణలు అందుబాటులో ఉన్నాయి. రోజులో గంట, రెండు గంటలు కేటాయిస్తే సరిపోతుంది. వారి అభిరుచికి తగ్గ కోర్సులు నేర్చుకోవచ్చు. సరదాగా సాగే ఈ కోర్సులు వారికి సంతోషంతో పాటు సృజనాత్మకతను మెరుగుపరుస్తాయి. అందులో భాగంగానే వేసవి సెలవుల్లో పిల్లలు నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన కోర్సుల జాబితాను నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా అందిస్తున్నది.
ఆన్లైన్లో స్టోరీ టెల్లింగ్ కోర్సులు..
స్కూల్లో టీచర్లు స్టోరీలు చెబుతుంటే పిల్లలు వింటారు. ఇప్పుడు పిల్లలే స్టోరీలు చెప్పేల తీర్చిదిద్దడానికి ఆన్లైన్లో స్టోరీ టెల్లింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇదొక నైపుణ్యమే. ఇంగ్లిష్, చైనీస్, అరబిక్, ఫ్రెంచ్, జపనీస్ భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. మొదటగా ఉచిత సెషన్స్ అందుబాటులో ఉంటాయి. అనంతరం నచ్చితే ప్యాకేజీల వారీగా శిక్షణ తరగతులను ఎంచుకోవచ్చు. గూగుల్, యూట్యూబ్, ప్లేస్టోర్‌లో పలు స్టోరీ టెల్లింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో లాగిన్ అయి రిజిస్టర్ కావాలి.
ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ తరగతులు..
ఆర్ట్స్ అంటే క్రాఫ్ట్ అంటే కళ, చేతిపనుల్లో పిల్లలను నిమగ్నం చేయడం. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయొచ్చు. దీంతో వారి సృజనాత్మక పెంపొందుతుంది. ఈ శిక్షణ తరగతులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఈ శిక్షణ వారిని విభిన్నంగా ఆలోచించేలా చేస్తుంది.
జిమ్నాస్టిక్, యోగా కోర్సులు..
ఆన్‌లైన్‌లోనూ జిమ్మాస్టిక్స్, యోగా నేర్పించే గురువులు ఉన్నారు. ఫ్లెక్సిబుల్ బాడీ డాన్స్, స్పోర్ట్స్‌లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది. ఆన్లైన్ ట్యూటర్లు నిర్వహించే జిమ్నాస్టిక్, యోగా సెషన్లు తప్పనిసరిగా హాజరయ్యేల పిల్లలను ప్రోత్సహించాలి.
కోడింగ్ నేర్చుకుందాం..
సాంకేతికత ఆధారంగా ప్రపంచంలో కోడింగ్ అనేది విద్యలో భాగంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రాజెక్టు తీసుకున్న కోడింగ్ ప్రక్రియ ఉంటుంది. పిల్లలను భవిష్యత్తుకు తీర్చిదిద్దడానికి కోడింగ్ శిక్షణ చాలా అవసరం. మొదటగా చాలా కోడింగ్ సంస్థలు ఉచిత సెషన్స్ ఇస్తాయి. నచ్చితే అందులో ప్యాకేజీల వారిగా ఎంచుకోవచ్చు. మైండ్ బాక్స్‌లాంటి సంస్థ కోడింగ్‌లో శిక్షణ ఇస్తుంది.
చెస్‌లో రాణిద్దాం..
వ్యూహాత్మక ఆలోచనా సామార్థ్యాలను మెరుగుపరచడంలో చెస్ ఎల్లప్పుడూ ఒక ఆసక్తికరమైన కోర్సు. ఆన్లైన్లో చెస్ కోర్సులు అందించే సంస్థలు అనేకం ఉన్నాయి. విశ్లేషణాత్మక ఆలోచన నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఇది పిల్లల మెదడుకు చక్కని వ్యాయామం. పిల్లలో ఐక్యూ లెవల్స్ పెరుగుతాయి. సమస్య పరిష్కార నైపుణ్యాలను అందిస్తుంది.
స్టెప్పేసి చూడు..
పిల్లలకు డ్యాన్స్ అంటే చాలా ఆసక్తి. వేసవి సెలవులు వారికి తెలియకుండా నృత్యాన్ని నేర్పిస్తాయి. అయితే డ్యాన్స్‌లో రాణించడానికి ఆన్లైన్లో అనేక శిక్షణలు ఉన్నాయి. పిల్లలు బద్ధకంగా ఉండకుండా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది.
ఘుమఘుమలాడిద్దాం..
పిల్లలకు వంటలో శిక్షణ ఇవ్వడం వారిలో కొత్త ఉత్సాహాన్ని అందించిన వారవుతారు. ఆన్లైన్లో వంటలు నేర్పించే పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వారికి నచ్చిన ఫుడ్‌ను వారే తయారు చేసుకునేలా రెసీపీలు నేర్పిస్తారు. వీటిని నేర్చుకోవడానికి పిల్లలూ ఉత్సాహం కనబరుస్తారు. వారికి వంటల తయారీపై మక్కువ ఉంటే భవిష్యత్తులో గొప్ప చెఫ్‌లుగా, బేకర్లుగా అవకాశాలు ఉంటాయి.
పజిల్ పట్టుబడుదాం..
ఆన్లైన్లో అనేక పజిల్స్ ఉంటాయి. పజిల్స్ ఎలా పరిష్కరించాలో మెలకువలు ఉంటాయి. ఇది పిల్లలు విజయవంతంగా చేసినప్పుడు వారికి ప్రేరణను ఇస్తుంది. ఆత్మగౌరవాన్ని మెరుగుపరుస్తుంది. సుడోకు పజిల్, వర్డ్ సెర్చ్ పజిల్, క్రాస్ వర్డ్ పజిల్ తదితరవి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.
తోట పనులు..
ఆన్లైన్లో తోట పనులు ఎలా చేయడమో కూడా అనేక వీడియోలు ఉన్నాయి. ఏ పంటలు పండించాలి ? ఎలా పండించాలి? అనే విషయాలుంటాయి. ఇంట్లో పెరిగే మొక్కల పరిరక్షణపై శిక్షణ తీసుకోవచ్చు. గార్డెనింగ్ కోర్సులపై పిల్లలకు అవగాహన కల్పించాలి. మాస్టర్ గార్డెనర్ కావాలనుకునే వారికి ఈ కోర్సులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అందమైన చిన్న తోటను ఎలా సృష్టించాలి? నిర్వహణ బాధ్యతలు ఇలా అన్ని నేర్పుతారు.
సరిగమలు నేర్చుకుందాం..
వేసవి సెలవుల్లో పిల్లలకకు సంగీతం నేర్పించడానికి సరైన సమయం. నేరుగా వీలులేని వారు ఆన్లైన్లో అనేక సంగీత అకాడమీలు సంగీతాన్ని నేర్పిస్తున్నాయి. సంగీత పరికరాలను వాయించడం కూడా నేర్పించేవి ఉన్నాయి.
ధ్యాన కోర్సులు..
ప్రతికూల భావోద్వేగాలు, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలిపేందుకు ఆన్లైన్లో ప్రపంచ వ్యాప్తంగా ధ్యాన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ధ్యానంలో నిపుణులైన గురువులు అందుబాటులో ఉండి పిల్లలకు శిక్షణ ఇస్తారు. ఇది వారికి వారి చదువులోనూ.. బంధంలోనూ చాలా ఉపయోగపడుతుంది.
గణిత నైపుణ్యం మెరుగు..
చాలా మంది పిల్లలకు మ్యాథ్స్ పెద్ద కష్టంగా వెంటాడుతుంది. ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు ఆన్లైన్లో గణితం సబ్జెక్టుకు సంబంధించి అనేక మంది ట్యూటర్లు అందుబాటులో ఉంటారు. అనేక మెలకువలు నేర్పిస్తారు. వారిని నిష్ణాతులుగా మారుస్తారు. క్రెటా లాంటి శిక్షణ సంస్థలు అందుబాటులో ఉన్నాయి.
రంగులద్దుదాం..
పిల్లల కోసం ఆన్లైన్లో అన్ని భాషల పెయింటింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్రష్ స్ట్రోక్స్, మెటీరియల్ వినియోగించడం ఇలా అనేక రకాలుగా అవగాహన కల్పిస్తారు. వాటర్ కలర్స్, టూల్స్, ఇంక్ తదితర వినియోగంపై అవగాహన కల్పిస్తారు.
ఆనందంతో పాటు విజ్ఞానానికి పెద్దపీట వేయాలి
సెలవుల్లో చాలా సమయం ఉంటుంది. పిల్లలకు పలు ఆన్లైన్ కోర్సులు నేర్పించండి. కొత్త విషయాలను నేర్చుకునేలా మీ పిల్లలను బయటి ప్రపంచానికి తీసుకెళ్లండి. వారు ప్రకృతిని ఆస్వాదించగలరు. ప్రపంచాన్ని పరిశీలించగలరు. వాస్తవానికి విద్యార్థులను చురుకుగా ఉండేలా చేయడానికి మానసిక, శారీరక ఆరోగ్యం చాలా కీలకం. ఈ సెలవుల్లో వారు కొత్త అభిరుచులు, నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది ఉత్తమ సమయం. వేసవి విరామానికి ఆటంకం కలగకుండానే వారు అటు సృజనాత్మకతలో.. ఇటు ఆటవిడుపులో రాణించేలా అద్భుతమైన ఆన్లైన్ శిక్షణ కార్యకలాపాలు ఉన్నాయి.
– డాక్టర్ జీసీ కవిత, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్.