సిద్దిపేట అర్బన్, మార్చి 18: పార్లమెంట్ సాధారణ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని సిద్దిపేట సీపీ అనురాధ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీలోగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని.. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తిరిగి నిబంధనల ప్రకారం తీసుకోవచ్చన్నారు. తుపాకులు డిపాజిట్ చేయని వారిపై ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ గురించి చర్యలు తీసుకుంటున్నామని.. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ప్రజలు, ప్రజాప్రతినిధులు తప్పకుండా పాటించాలని సూచించారు. జిల్లాలో బార్డర్ పోలీస్స్టేషన్ల పరిధిలో 10 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, 24 గంటలు వాహనాలను తనిఖీ చేస్తున్నామని చెప్పారు.