చిన్నకోడూరు, డిసెంబర్ 1: అజ్ఞానం అనే అంధకారాన్ని కార్తికదీపం తొలిగిస్తుందని సిద్దిపేట జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ రంగనాయకసాగర్ ప్రాజెక్టులో కార్తిక దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీప వెలుగులు ఉన్నచోట ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు వెల్లివిరుస్తాయన్నారు.
కార్తికమాసం పర్వదినాన్ని పురసరించుకొని వెలిగించే దీపాలు సమాజంలో చెడు, దుఃఖం, నిరుత్సాహం తొలిగిస్తుందన్నారు. అందుకే కార్తికదీపం ప్రతి ఒకరి జీవితాల్లో వెలుగు నింపే గొప్ప పండుగగా ప్రసిద్ధి చెందిందన్నారు. గులాబీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సహకారంతో ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. కార్యక్రమంలో అల్లిపూర్ సొసైటీ వైస్ చైర్మన్ అనుపాటి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ దుర్గారెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లింగం, మహిళలు పాల్గొన్నారు.