ఇంటర్మీడియెడ్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం రిజల్ట్స్ ప్రకటించగా మొదటి సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో సంగారెడ్డి జిల్లా 57శాతంతో 17వ స్థానం, ద్వితీయ సంవత్సరం 66 శాతంతో 15వ స్థానంలో నిలిచింది. ఫస్ట్‌ఇయర్‌లో 7,675 మంది బాలురు పరీక్షలు రాయగా, 3,636 మంది.. బాలికలు 9,983 మందికి, 6,580 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్లో 5,609 మంది బాలురకు 3212 మంది, బాలికలు 8386 మందికి 6,058 మంది పాసయ్యారు. మెదక్ జిల్లా గతేడాదిలాగే రాష్ట్రంలో చివరిస్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్ 38శాతం, సెకండ్ ఇయర్లో 52శాతం ఉత్తీర్ణత సాధించింది. షార్ట్ మెమోలు కావాల్సిన విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కావాలనుకువారు నేటి నుంచి 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి రెండు విడుతల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
– సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, మే 9
సిద్దిపేట అర్బన్, మే 9 : ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. అయితే ఈ సారి కూడా సిద్దిపేట జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం అధికంగా నమోదైంది. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరంలోనూ బాలికలే పై చేయి సాధించారు. మార్చి నెల 15వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీన ముగిశాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా జనరల్ విభాగంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 52 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. ద్వితీయ సంవత్సరంలో 65 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ఫస్టియర్ ఫలితాల్లో 15వ స్థానంలో ఉండగా.. సెకండియర్ ఫలితాల్లో 11వ స్థానంలో నిలించింది. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు నేటి నుంచే ఐప్లె చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
సత్తా చాటిన బాలికలు
ఇంటర్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లాలో బాలికలు సత్తా చాటారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్‌లో 8,145 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 4,315 మంది ఉత్తీర్ణత సాధించగా 52 శాతం నమోదైంది. ఇందులో 3,637 మంది బాలురలో 1,549 మంది ఉత్తీర్ణత సాధించగా 42 శాతం, బాలికలు 4,508 మంది పరీక్ష రాయగా..61 శాతంతో 2,766 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్‌లో సిద్దిపేట మొత్తం జిల్లా వ్యాప్తంగా 7,703 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 5,045 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై.. 65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో 3,460 బాలురలో 1,974 మంది ఉత్తీర్ణులు కాగా 57 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. 4,243 మంది బాలికలకు 72 శాతంతో 3,071 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెండింటిలోనూ బాలికలే పైచేయిగా నిలిచారు.
ఒకేషనల్ ఇంటర్లో తగ్గిన ఉత్తీర్ణత శాతం
ఇంటర్ ఒకేషనల్ ఫలితాల్లో జిల్లాలో ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైంది. ఒకేషనల్ ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం 3,021 మంది విద్యార్థుకుగానూ 1,342 మంది మాత్రమే ఉత్తీర్ణులై.. 44 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో 1,699 మంది బాలురకు 29 శాతంతో 493 మంది ఉత్తీర్ణులయ్యారు. 1,322 మంది బాలికలకు 64 శాతంతో 849 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ విభాగంలో 2,891 మంది విద్యార్థులకుగానూ 1,579 మంది ఉత్తీర్ణులై.. 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 1,7 09 మంది 41 శాతంతో 706 మంది పాసయ్యారు. 1,182 మంది బాలికలకు 73 శాతంతో 873 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే ఒకేషనల్ ఫలితాల్లోనూ బాలుర కంటే బాలికలదే హవా కొనసాగింది. కానీ ఇంటర్ ఒకేషనల్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా వెనుకబడింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఒకేషనల్ ఫలితాల్లో రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా 17వ స్థానంలో ఉండగా.. సెకండియర్ ఒకేషనల్ ఫలితాల్లో చిట్ట చివరన 22వ స్థానంలో ఉంది.
జూన్ 4వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4వ తేదీ నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అంతే కాకుండా నేటి నుంచే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. రికౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఈ నెల 16వ తేదీ వరకు గడువు విధించినట్లు అధికారులు తెలిపారు.