వర్గల్, జనవరి 3: ఆయన 70 ఏండ్ల వృద్ధుడు.. ఇప్పటికీ కాళ్లకు గజ్జె కట్టాడంటే సాక్షాత్తు ఆ నటరాజే నృత్యం చేస్తున్నాడా? అనే విధంగా ఉంటది. ముఖంపై రంగు వేసుకున్నాడా.. పాత్ర ఏదైనా పండాల్సిందే.. అతి తక్కువగా జానపద కళాకారుల్లో బతకలేక, చావలేక అంతరిస్తున్న చింధుభాగోతానికి ఆయన ఒక కొనఊపిరిలా మిగిలాడు. రామాయణం అయినా? శ్రీకృష్ణపాండవీయం అయినా? వేషానికి తగ్గ గాత్రం, అభినయం ప్రదర్శించడం పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. ఆయనే వర్గల్ మండలం మైలారం గ్రామానికి చెందిన చిందు భాగవతం కళాకారుడు చిందు మల్లయ్య.
నచ్చిన పాత్రలు.. ఎనలేని గుర్తింపులు
మల్లయ్య ముఖ్యంగా దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు, రాముడు, రావణాసురుడు, బృహన్నల, విశ్వామితుడ్రు, నక్షత్రకుడు, అభిమన్యుడు, అర్జునుడు, భీముడు, భీష్ముడు.. ఇలా పదుల సంఖ్యల పాత్రలో జనం మెచ్చేటట్టుగా ఒదిగిపోయేవాడు. తనకు బాగా గుర్తింపు తెచ్చిన పౌరాణిక పాత్రలు కూడా ఇవేనని చెబుతాడు. నాటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ దగ్గర నుంచి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వరకు పలువురు ప్రముఖుల చేత ప్రశంసాపత్రాలూ, కితాబులు, బహుమానాలు అందుకున్నాడు. భళా! చిందు మల్లయ్య అనిపించుకొని ఎనలేని గుర్తింపు పొందాడు.
అప్రతిహత జైత్రయాత్ర
మల్లయ్యది వాస్తవంగా కూటికి, పాటికి నీడలేని కుటుంబం. ఉండి వచ్చిన పగటి వేషగాడు. 1950లోనే ముఖానికి రంగువేసుకొని కడుపునింపుకున్న వ్యక్తి మల్లయ్య. భార్య ఎల్లమ్మ కూడా తన సహధర్మాన్ని అనుసరిస్తూ తాను కూడా రేణుకా ఎల్లమ్మ, సత్యభామ, రుక్మిణి, సీత తదితర పాత్రలో భర్తను మించేలా పాత్రలో లీనమై ప్రేక్షకులను మెప్పించేది. టీవీలు, తెర చాపలు, థియేటర్లు అందుబాటులో లేని కాలంలో చిందు భాగవతం మూడుపువ్వులు.. ఆరుకాయల్లా ఉండేది. గల్లీలో మొదలైన మల్లయ్య వేషం ఢిల్లీ వరకు వెళ్లింది. 1980 దశాబ్దం చివరి అంకంలో అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్‌గాంధీ చేతుల మీదుగా కేంద్రసాహిత్య అవార్డు అందుకోవడమే కాకుండా ప్రత్యేక కితాబు పొందాడు. నాటి నుంచి ఏడుపదుల వయసు వచ్చేవరకు మల్లయ్య నటనాకౌశలం అప్రతిహత జైత్రయాత్రలా కొనసాగింది.
జానపద కళా మర్మయోగి ‘మల్లన్న’
మల్లయ్య ధారణపాండిత్యం కంటే ఆశుపాండిత్యాన్ని బాగా నమ్మాడు. గజిబిజి పదాలు, నాలుకతిరగని పదాలను అలవోకగా మంచినీళ్లు తాగినట్లు చదివి వినిపిస్తాడు. ముఖానికి వేసుకునే ఏ రంగు పాత్రనైనా సరే పొట్టకూటి కోసం కాకుండా భావితరాలకు ఉపయోగపడేలా ఉండాలన్నదే ఆయన సిద్ధాంతం.. పాత్రేదైనా, పరకాయప్రవేశం ఆయన నైజం.. కంద, సీసం, చంపకమాల, ఉత్పలమాల తేటగీతి ఇలా ఛందోబద్ధమైన పద్యాలను ధారణ ఎత్తి పాడగలడు. శబ్ధం, లయ, రాగం తెలిసిన గ్రామీణ విధ్వాంసుడు మలకలయ్య. ప్రస్తుతం 70ఏండ్లు దాటినా ఇప్పటికీ సాహిత్యం, కళల మీద మమకారం పోలేక ఖాళీ సమయంలో జానపద పుస్తకాలు చదువుతూ ఉంటాడు.
జానపద కళను ప్రోత్సహించాలి
టీవీ సీరియళ్లు, సినిమా థియేటర్లతో జానపద కళ పూర్తిగా కనుమరుగైంది. దేవాలయ వార్షికోత్సవాలకో.. శివరాత్రి జాగరణలకో.. లేకపోతే చావులకో.. దినవారాలకో.. భజన కోసం కొద్దోగొప్పో పిలుస్తున్నారు. ఇది కూడా పల్లెటూర్లకే పరిమితమైంది. మిగతా ఏడాది కాలమంతా చేతులు ముందర పెట్టుకొని కూర్చోవాల్సిందే. జానపద కళాకారులను గుర్తించింది మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సారే. ప్రభుత్వం మరింత చొరవ తీసుకొని జానపద కళను ప్రోత్సాహించాలన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం.
– చిందు మల్లయ్య