సిద్దిపేట ప్రతినిధి/ బెజ్జంకి, మార్చి 31 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు స్వచ్ఛందంగా తరలి వెళ్లడానికి సబ్బండ వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మం డల కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివెళ్లడానికి ఎవరి తొవ్వ ఖర్చులు వారే సమకూర్చుకుంటున్నారు. వ్యవసాయ పనుల సీజన్ కావడంతో కూలి పనులు చేసి సభకు వెళ్లేందుకు డబ్బులు పోగు చేసుకుంటున్నారు.
సిద్దిపేట జిల్లా మానకొండురు నియోజకవర్గం బెజ్జంకి మండలం లక్ష్మిపూర్‌లో సోమవారం బీఆర్ఎస్ మహిళా నేతలు, మాజీ మహిళా ప్రజాప్రతినిధులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తామంతా స్వచ్ఛందంగా తరలివెళ్లి కేసీఆర్ సభను విజయవంతం చేస్తామంటున్నారు. సభకు అవసరమయ్యే ఖర్చులను తామే సొంతంగా సమకూర్చుకుంటున్నామని చెప్పా రు.
కేసీఆర్ సార్ లేకుంటే కాళేశ్వరం లేదు… మధ్యమానేరు లేదు…ఇయ్యాల అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా వస్తున్న కాల్వ నీళ్లతో బీడు భూముల్లో సైతం పుట్లకొద్దీ ధాన్యం, మొకజొన్నలు పండుతున్నాయి. దీనికి కార ణం కేసీఆర్ సార్ తెచ్చిన కాళేశ్వరం నీళ్లతోనేనని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదేండ్లలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాల్వలు తెచ్చారు. ఇయ్యాల మా బతుకుల్లో ఆనందం ఉందని రైతులు పేర్కొంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు నీళ్లు ఇవ్వడానికి కారణమైన కేసీఆర్ సార్ పెట్టబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేము సైతం తరలివస్తామని రైతులు దండుగా కదులుతున్నారు. ప్రతిరోజూ ఒక గ్రామం లో కూలి పని చేసి వచ్చిన డబ్బులతో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా దండు కదలబోతుంది. పని చేసిన డబ్బులతో వాహనాలు, భోజనం, తాగునీటి కోసం వెచ్చించుకుంటామని, మళ్లీ కేసీఆర్ సార్ కావాలంటూ మహిళలు నినదించారు.
చారిత్రాత్మక సభకు వినూత్న కార్యక్రమం
రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్న కార్యక్రమానికి మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండల మహిళా నేతలు శ్రీకారం చుట్టారు. కేసీఆర్ మీద ఉన్న అభిమానంతోపాటు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్లొన్నవారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాణి రుద్రమాదేవిలాగా పోరాటం చేసిన మహిళా నేతలు ఉన్నారు. వారంతా కూడా ఇవ్వాళ మళ్లీ కేసీఆర్ సార్ రావాలి… రైతుల బాధలు పోవాలి.. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని మహిళా నేతలు నినదిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో దాదాపు 14 ఏండ్ల పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినవారే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల పాటు వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధులుగా చేసిన వారు సైతం కూలీ పని చేసిన వారిలో ఉన్నారు. ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన మహిళా నేతలు ఇవ్వాళ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సిద్ధమవుతూ.. మిగితా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతిరోజూ కూలి పనులు చేస్తూతమ మండలంలోని అన్ని గ్రామాల క్యాడర్ తరలివెళ్లడానికి కూలి పనులు చేసి డబ్బులు సమకూర్చుకుంటామంటున్నారు.
రైతు బాల్‌రెడ్డి మక్క చేనులో కూలి పని
బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామం లో రైతు బాల్‌రెడ్డి మక్క చేనులో బీఆర్ఎస్ మహిళా నేతలు, మహిళా ప్రజాప్రతినిధులు కూలి పని చేశారు. మొక్కజొన్న పంటలో మక్కలు ఏరే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చేనులో ఉన్న కంకులను ఏరి సంచుల్లో నింపి ట్రాక్టర్లో పోశారు. సుమారుగా వంద మందికి పైగా మహిళా నేతలు కూలి పనిలో పాల్గొన్నారు. దాదాపుగా మూడు గంటలకు పైగా కూలి పని చేశారు. ఇందుకు ప్రతి మహి ళకు కూలి ఇచ్చారు. మహిళా నేతలు చేసిన కూలి పనికి రైతు రూ.10వేలు ఇచ్చారు. వీటిని కేసీఆర్ సభకు తరలివెళ్లేందుకు వినియోగించుకుంటామని మహిళా నేతలు చెప్పారు.
ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తెలంగాణ
ఏప్రిల్ 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లడానికి బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్‌లోని రైతు బాల్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మొకజొన్న కంకులు ఏరుతూ కూలి పనిచేసిన ఆడబిడ్డలకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను ముందుండి నడిపి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినది ఆడబిడ్డలేనన్నారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం ఆగంకావొద్దు సారూ మీరుంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని పదేండ్లు కేసీఆర్ సార్‌ను దీవించి సీఎం చేసింది ఆడబిడ్డలేనన్నారు.
వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం వాహనాలను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని చెప్పినా ఆడబిడ్డలు తమ సొంత ఖర్చులతోనే వాహనాలు ఏర్పాటు చేసుకొని వస్తామని, కూలి పనిచేసిన ఆడబిడ్డలకు శతకోటి వందనాలన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ గులాబీ పార్టీ… గులాబీ పార్టీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం లేదని, ఆడబిడ్డలే సొంతంగా వాహనాలు పెట్టుకొని వస్తామనడం వారి అభిమానానికి ధన్యవాదాలు.
సాగునీళ్లు ఇవ్వడానికి కారణమైన కేసీఆర్ సార్ పెట్టబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేము సైతం తరలివస్తామని రైతులు కదులుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా దండు కదలబోతుందన్నారు. కేసీఆర్ సార్ లేకుంటే కాళేశ్వరం లేదు… మధ్యమానేరు లేదు… ఇయ్యల అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా వస్తున్న కాల్వ నీళ్లతో బీడుభూముల్లో సైతం పుట్లకొద్దీ ధాన్యం, మొకజొన్నలు పండుతున్నాయి. దీనికి కారణం కేసీఆర్ సార్ తెచ్చిన కాళేశ్వరం నీళ్లేనని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉక్కు గుండెను ఒక్కసారి చూసిరావాలి
ఉక్కుగుండెను ఒక్కసారి చూసి రావాలని, రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నామని పార్టీ మహిళా నేతలు చెబుతున్నారు. ఆ ఉక్కు గుండెను చూడడానికి మా భర్తల డబ్బులతోనో… మా అత్తమామల డబ్బులతోనో.. మా అన్నలు ఇచ్చే డబ్బులతోనో కాదు..స్వయంగా తాము కూలి పని చేసి వచ్చిన డబ్బులతోనే రజతోత్సవ సభకు వెళ్లి ఆ ఉక్కుగుండె ( కేసీఆర్ బాపు)ను చూసి వస్తాం. తామంతా మీ వెంటే అని గట్టిగా చెబుతాం.. మళ్లీ మీరే సీఎం కావాలి… సీఎం అయ్యే వరకు తాము తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటం చేస్తామని మహిళా నేతులు గట్టిగా నినదించారు.
కూలిపనికి వచ్చిన మహిళలకు కృతజ్ఞతలు
వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి మహిళా మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో కూలి పని కోసం తరలిరావడం అభినందనీయం. పార్టీ మీద అభిమానంతో పని చేసిన మహిళలకు కృతజ్ఞతలు. బీఆర్ఎస్ సభ కోసం స్వచ్ఛందంగా ప్రజలు, రైతులు ముందుకురావడం సంతోషంగా ఉంది. రజతోత్సవ సభకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలి.
– ఎర్పుల అపూర్వ, మహిళా నాయకురాలు
అభిమానంతో పనికి వచ్చినం
కేసీఆర్, బీఆర్ఎస్ అం టే ఎంతో ఇష్టం. వరంగల్‌లో జరిగే సభ కోసం స్వచ్ఛందంగా ఖర్చులకు డబ్బులు సమకూర్చుకునేందుకు కూలి పనికి వచ్చినం. రజతోత్సవ సభతో పాటు కేసీఆర్‌ను చూడడానికే కష్టపడి కూలి పని చేస్తున్నాం. మండలంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలందరూ భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్ పాలనలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారు.
– లింగాల నిర్మల, మాజీ ఎంపీపీ
బహిరంగ సభను విజయవంతం చేయాలి
వరంగల్‌లో జరిగే పార్టీ రజతోత్సవ సభకు బెజ్జంకి మండలం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలి. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశానుసారం పార్టీ సభ కోసం పనిచేస్తు న్నం. సభ ప్రకటించినప్పటి నుంచి ప్రజల్లో మంచి స్పందన ఉంది. సభకు స్వచ్ఛందంగా వస్తామని ప్రజలు ముందుకు వస్తున్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. బీఆర్ఎస్ పాలనలో లక్ష్మీపూర్ గ్రామానికి సంపూర్ణంగా సాగునీరు అందింది. ఇప్పుడు సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయి. బీఆర్ఎస్ పాలనే సువర్ణ పాలనగా ప్రజలు భావిస్తున్నారు.
– పాకాల మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, బెజ్జంకి
మండుటెండల్లో మత్తడ్లు దుంకాయి..
బీఆర్ఎస్ హయాంలో మండుటెండల్లో మత్తళ్లు దుంకడంతో పొలాలు ఎండిపోకుండా కాపాడుకున్నం. నేడు సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయి. రైతులు తీవ్రమైన బాధలో ఉన్నారు. రుణమాఫీ కాక, రైతుబంధు రాక, సకాలంలో ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. రజతోత్సవ సభ విజయవంతం అవుతుంది.
– బొమ్మకంటి రామలింగారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు
స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు..
రజతోత్సవ సభకు తమ ఖర్చులను తామే భరించుకొని సభకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు కూలి పనికి వచ్చిన. తొలి సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కృషితోనే నియోజకవర్గం అభివృద్ధిలో ముందువరుసలో ఉంది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసి నేడు స్వరాష్ట్ర కలను సిద్ధింపజేసిన పార్టీగా ప్రజలు గుండెల్లో చెరగని ముద్రవేసింది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. నేడు గ్రామా ల్లో ప్రజలు అనేక సమస్యలతో సతమతవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
– కనగండ్ల కవిత, మాజీ జడ్పీటీసీ, బెజ్జంకి