శనివారం 05 డిసెంబర్ 2020
Medak - Oct 25, 2020 , 00:03:39

దుర్గామాతకు విశేష పూజలు

 దుర్గామాతకు విశేష పూజలు

 కొల్చారం : మండలవ్యాప్తంగా దేవీ నవరాత్రులు భక్తిశ్రద్ధలతో సాగుతున్నా యి. ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో కొలువైన దుర్గామాత వారం రోజులుగా రోజుకో రూపంలో ప్రత్యేక పూజలందుకోగా, ఆదివారం శరన్నవ రాత్రోత్సవాలు ముగియనున్నాయి. చెడుపై మంచికి విజయంగా నిర్వహించే విజయదశమి పర్వదినం పురస్కరించుకుని అమ్మవారిని గ్రామ వీధుల్లో  ఊరేగించి చెరువుల్లో నిమజ్జనం చేయనున్నారు. కాగా, శుక్రవారం రాత్రి రంగంపేటలోని దుర్గాభవానీ మండపం వద్ద దీపారాధన కార్యక్రమాన్ని సర్పంచ్‌ బండి సుజాతారమేశ్‌ దంపతులు ప్రారంభించగా, మహిళలు దీపారాధనలో పాల్గొన్నారు. 

  చాముండేశ్వరీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు 

 చిలిపిచెడ్‌ : మండల పరిధిలోని చిట్కుల్‌ గ్రామ శివారులో మంజీరా నది తీరాన వెలిసిన చాముండేశ్వరీ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 8వ రోజు అభిషేకాలు, పారాయణం, మహాపూజ, మహానివేదన, హారతి  ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి పూజ లు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు ప్రభాకర్‌శర్మ ఆధ్వర్యంలో భక్తులు అమ్మవారికి కుంకుమార్చన, ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు.

 దుర్గామాత పూజలో పాల్గొన్న మున్సిపల్‌ చైర్మన్‌ 

నర్సాపూర్‌ రూరల్‌ :  పట్టణంలోని ధర్మశాలలో ప్రతిష్ఠించిన దుర్గామాతకు శనివారం మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భగవంతుడి దయతో ఈ సారి వర్షాలు సమృద్ధ్దిగా కురిశాయని పేర్కొన్నారు. పూజా కార్యక్రమంలో నాయకులు అశోక్‌గౌడ్‌, రమేశ్‌గౌడ్‌, ఆంజనేయులుగౌడ్‌, అనిల్‌గౌడ్‌ పాల్గొన్నారు.