శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Sep 07, 2020 , 23:42:09

పచ్చదనాన్ని పెంచడమే.. ప్రభుత్వ లక్ష్యం

పచ్చదనాన్ని పెంచడమే..  ప్రభుత్వ లక్ష్యం

  • n రాష్ట్ర అటవీశాఖ మంత్రి  ఇంద్రకరణ్‌రెడ్డి
  • n గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా  మొక్కలు నాటిన  మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోశ్‌కుమార్‌,హీరో ప్రభాస్‌
  • n 1200 ఎకరాల్లో నిర్మించే అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును దత్తత తీసుకున్న హీరో ప్రభాస్‌
  • n అభివృద్ధికి రూ.2 కోట్లు విరాళం

జిన్నారం : పచ్చదనాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే పల్లె ప్రకృతి వనాలు, ఆక్సిజన్‌ పార్కులను నిర్మిస్తున్నామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఖాజీపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు శంకుస్థాపన కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ సంతోశ్‌కుమార్‌, హీరో ప్రభాస్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో మంత్రి, ఎంపీ, హీరో ప్రభాస్‌ కలిసి గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పల్లెలను ఆహ్లాదకర వాతావరణానికి అనువుగా మార్చేందుకు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో కోట్లాది మొక్కలు నాటి, సంరక్షిస్తున్నామన్నారు. పర్యావరన పరిరక్షణకు అందరూ కలిసి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. సుమారు 1650 ఎకరాలు ఉన్న అటవీని సినీహీరో ప్రభాస్‌ దత్తత తీసుకున్నారు. తన తండ్రి సత్యనారాయణరాజు పేరు మీద ఫారెస్ట్‌ను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన ప్రభాస్‌, అటవీ అభివృద్ధికి రూ.2కోట్లు కేటాయించారు.  కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర అటవీశాఖ అధికారిణి శోభ, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు, జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు, ఆర్డీవో ఎం.నగేశ్‌, తహసీల్దార్‌ దశరథ్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి రఘుపతి స్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


logo