సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Jan 22, 2020 , 04:53:20

అన్నదాతలకు శుభవార్త

అన్నదాతలకు శుభవార్త


మెదక్, నమస్తే తెలంగాణ : తెలంగాణ రైతులకు కేసీఆర్ శుభవార్త అందించారు. రైతు బంధు పథకానికి సంబంధించి తాజాగా యాసంగికి నిధులను విడుదల చేశారు. రైతుల ఖాతాల్లో అతి త్వరలో డబ్బులు వేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.5,100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి సోమవారం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే.  అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యంగా టీఆర్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో ఆసరాగా నిలుస్తున్నది. 2019-20 వార్షిక బడ్జెట్ రైతు బంధు కోసం రూ.12,862 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వానకాలం సాగుకు రూ.6,862 కోట్లు మంజూరు చేసి రైతుల ఖాతాల్లో జమ చేయగా, తాజాగా యాసంగి కోసం రూ. 5,100 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ కూడా వెంటనే పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. నిధుల మంజూరుకు సంబంధించిన పరిపాలనా అనుమతులు కూడా రావడంతో వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్థిక శాఖకు అందించనున్నది. వివరాలు అందిన వెంటనే ఆర్థిక శాఖ సదరు నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రైతు బంధు, రుణ మాఫీ నిధులను ప్రధానాస్త్రంగా చేసుకొని ప్రతిపక్షాలు విమర్శలు చేయగా, ఆ విమర్శలకు చెక్ పెడుతూ ఎన్నికలకు ముందే రైతు బంధు నిధులు విడుదల చేయడం గమనార్హం.
జిల్లాలో 2 లక్షల 20వేల మంది రైతులకు ప్రయోజనం..

రైతు బంధు పథకం నుంచి ఇప్పటికే జిల్లాలోని లక్షలాది మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. తాజాగా ఈ ఏడాది కూడా యాసంగి సాగుకు సంబంధించి రైతు బంధు నిధులను విడుదల చేయడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని సుమారు 2 లక్షల 20వేల మంది రైతులకు సుమారు రూ.188 కోట్ల నిధులు విడుదలైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఏటా రైతన్నలకు కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించడం దేశానికే ఆదర్శమని, ప్రధానితో పాటు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సైతం ప్రశంసించారు. తాజాగా యాసంగి రైతుబంధు నిధులు విడుదల చేయడంపై జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.logo