భర్తతో కలిసి ఉపాధి పొందుతున్న మహిళ
సిద్దిపేట, ఫిబ్రవరి 12 : సాధారణంగా బ్యూటీ పార్లర్లో మహిళలు హెయిర్ కటింగ్ చేయడం చూస్తాం.. కానీ, ఇక్కడ ఓ మహిళ పురుషులు, పిల్లలకు కటింగ్ చేస్తున్నది. మగవాళ్లకు దీటుగా.. స్టెలిష్‌గా.. హెయిర్ కటింగ్ చేస్తూ ఔరా అనిపిస్తున్నది. ఇది ఎక్కడో కాదండోయ్.. మన సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్‌నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో.. ఆ మహిళే కోత్వాల్ లావణ్య. ఆమె గురించి ఈ వారం ‘సండే స్పెషల్’లో మీ కోసం..
సాధారణంగా హెయిర్ కటింగ్ సెలూన్లో పురుషులే పని చేస్తారు. సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్‌నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలో కోత్వాల్ లావణ్య అనే మహిళ పురుషులకు తానే స్వయంగా కటింగ్ చేస్తూ పురుషులకు తక్కువ కాదని నిరూపిస్తున్నది. జిల్లా కేంద్రమైన సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్‌నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీ చెందిన లావణ్య, తన భర్తతో కలిసి మేన్స్ హెయిర్ కటింగ్ సెలూన్ నిర్వహిస్తున్నది. లాక్డౌన్లో లావణ్య తన భర్త వద్ద కటింగ్ నేర్చుకుంది. అప్పటి నుంచి భర్తలో అదే షాపులో మొదట్లో పిల్లలకు, తర్వాత షేవింగ్, కటింగ్ చేయడం ప్రారంభించింది. అంతే గాకుండా పిల్లలు కోరుకున్న విధంగా ైస్టెలిష్ కటింగ్ చేస్తూ అబ్బురపరుస్తున్నది. కాగా, లావణ్య భర్త శ్రీనివాస్‌కు మంత్రి హరీశ్‌రావు అంటే ఎనలేని అభిమానం. గతేడాది నవంబర్‌లో కేసీఆర్‌నగర్‌లో ‘హరీశన్న హేర్ కటింగ్’ పేరిట సెలూన్ షాపు ఏర్పాటు చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌రావు లక్ష మెజార్టీ రావాలని ఆకాంక్షిస్తూ నెల రోజుల పాటు ఉచితంగా అందరికీ కటింగ్ చేసి, తన అభిమానాన్ని చాటాడు.
అన్ని రకాల కటింగ్ చేస్తా..
మా కుల వృత్తి అయిన హెయిర్ కటింగ్ సెలూన్ షాపులో పని చేయడం సంతోషంగా ఉంది. నా భర్త శ్రీనివాస్ ప్రోత్సాహంతో రెండు నెలులుగా ఇక్కడ కటింగ్, షేవింగ్ పనులు చేస్తున్నా. నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు అన్ని రకాల కటింగ్ చేస్తున్నా.
– కోత్వాల్ లావణ్య