బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Jan 21, 2020 , 01:13:01

ష్‌..! గప్‌చుప్‌

ష్‌..! గప్‌చుప్‌
  • - ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం
మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. అభ్యర్థులతో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రచారం హోరెత్తించారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు గెలుపు బాధ్యతలు తమ భుజాలపై వేసుకుని ముందుకు సాగారు. టిక్కెట్ల కేటాయింపు నుంచి అన్నీతామై వ్యవహరించారు. ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చెన్నూరు, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లారు. అందుకే చెన్నూర్‌లో రికార్డు స్థాయిలో 18 స్థానాల్లో ఏడు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరొక వార్డులో పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో అది కూడా టీఆర్‌ఎస్‌ ఖాతా లో పడింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే చెన్నూర్‌ పీఠం టీఆర్‌ఎస్‌ వశం అయ్యింది.

ఇక క్యాతన్‌పల్లిలో కూడా ఒకటి, రెండు చోట్లు మినహా పెద్దగా పోటీ కూడా లేదు. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సైతం మూడు మున్సిపాలిటీల్లో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఒక వార్డు ఏకగ్రీవం అయ్యింది. ఎమ్మెల్యేల ప్రచారంలో పెద్ద ఎత్తున జనం ముఖ్యంగా మహిళలు హాజరయ్యారు. వారితోపాటు ద్వితీయ శ్రేణి నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అభ్యర్థులు అందరూ తమ సత్తా చాటుకునే దిశగా చివరి రోజు ప్రచారం ముగించారు. ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఓటేసేందుకు అభ్యర్థించారు. కాగా, ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు.

వీరు కూడా పెద్ద ఎత్తున ప్రచారం..

జిల్లాలోని స్థానిక ఎమ్మెల్యేలతోపాటు పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, నారదాసు లక్ష్మణ్‌రావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేతకాని, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి, పార్టీ ఇన్‌చార్జి మూల విజయారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు తనయుడు విజిత్‌రావు కూడా ప్రచారంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ అటు ప్రచారంలో పాల్గొనడమే కాకుండా, చెన్నూరులో వార్డులు ఏకగ్రీవం కావడంలో తన వంతు పాత్ర పోషించారు. అదే సమయంలో తన వర్గానికి చెందిన ఓటర్లను ఒక్క తాటిపైకి తీసుకొచ్చారు. ఇక పార్టీ ఇన్‌చార్జి మూల విజయారెడ్డి కూడా ఎక్కడికక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు తనయుడు విజిత్‌రావు మంచిర్యాల మున్సిపాలిటీలో అన్నీతానై వ్యవహరించారు. ఎక్కడికక్కడ నేతలను సమన్వయం చేసుకుంటూ, ప్రచార బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు.

మద్యం బంద్‌..

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. సోమవారం సాయంత్రం నుంచి ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు ఉండనున్నా యి. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం, ముగ్గురికి మించి గుమికూడటం నేరంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఆరు మున్సిపాలిటీల్లో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మూసివేశారు. జిల్లావ్యాప్తంగా 42 లిక్కర్‌ షాపులు, ఏడు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, 1 క్లబ్‌, 34 కల్లు దుకాణాలు మూసివేయాలని కలెక్టర్‌ భారతి ఆదేశాల మేరకు వాటిని మూసివేసినట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. 22వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ముసి ఉండనున్నాయి. అక్రమంగా మద్యం సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

కరువు తీరా కూలీ..

ఎన్నికల ప్రచారం పుణ్యమా అని అనేక మందికి ఉపాధి దొరికింది. కరపత్రాలు, పోస్టర్లు, స్టిక్లర్లు ఇలా అన్ని రకాలుగా ఆయా షాపుల వారికి ఉపాధి లభించింది. ఇక ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు పెద్ద ఎత్తున కూలీ దొరికింది. అడ్డా కూలీలు, ఇతరులకు రోజు వారి ఉపాధి లభించింది. ఆయా మున్సిపాలిటీల్లో ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.500 వరకు చెల్లించారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం బిర్యానీతోపాటు సాయంత్రం మగాళ్లకు మందు కోసం అదనంగా డబ్బులు చెల్లించారు. ఒక్కో అభ్యర్థి 30 మంది నుంచి 50 మందిని తమ ప్రచారానికి తిప్పుకున్నారు. దీంతో దాదాపు వారం రోజులపాటు వారికి ఎలాంటి లోటు లేకుండా గడిచింది. మరోవైపు కూలీలు అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ రంగానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెల్లడించారు.

తెర వెనక మంత్రాంగం..

ఎన్నికలకు ఒక్క రోజు గడువే ఉండటంతో ఓటర్లను ఆకట్టకునేందుకు ప్రలోభాల పర్వం మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. మందు, విందు, వినోదాలతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే రాత్రిళ్లు పెద్ద ఎత్తున మందు సరఫరా చేస్తున్న అభ్యర్థులు చివరి రోజు పెద్ద ఎత్తున పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దావత్‌లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున మద్యం కొనుగోళ్లు కూడా జరిగాయి. లక్షల రూపాయల్లో మద్యం కొనుగోలు చేసి ఆ మద్యాన్ని పంపిణీ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇంటింటికి వెళ్లి నగదు, మద్యం పంపిణీకీ కూడా కొంతమంది సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు ఓపెన్‌గా జరిగిన కార్యక్రమాలు అన్నీ ఇక తెర వెనక సాగనున్నాయి. ప్రచార గడువు ముగియడంతో అసలు మంత్రాంగం మొదలు పెట్టారు. దీని కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు షురు చేశారు.logo