కోస్గి, నవంబర్ 8 : కోస్గి పట్టణంలోని ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో అండర్-17 ఎస్జీఎఫ్ 69వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 320 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఒక్కో జిల్లా నుంచి బాలురు, బాలికల రెండు జట్ల చొప్పున పాల్గొంటున్నాయి. తొలిరోజు బాలికల విభాగంలో మొదటి మ్యాచ్ ఆదిలాబాద్-వరంగల్ మధ్య జరగగా, 11-02 పాయింట్లతో ఆదిలాబాద్ గెలుపొందింది. ఖమ్మంపై 01-05 పాయింట్లతో నిజమాబాద్, హైదరాబాద్‌పై 13-07 తేడాతో, రంగారెడ్డిపై 07-00 తేడాతో మహబూబ్‌నగర్ జట్లు, హైదరాబాద్‌పై 03-10 తేడాతో నల్లగొండ జట్లు గెలుపొందాయి. అలాగే బాలుర విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు మూడు మ్యాచులలో విజయం సాధించింది.
హైదరాబాద్‌పై 18-06 తేడాతో, రంగారెడ్డిపై 13-07 తేడాతో, ఖమ్మంపై 15-09 తేడాతో మహబూబ్‌నగర్ జట్లు, మహబూబ్‌నగర్‌పై 06-07 తేడాతో మెదక్, ఆదిలాబాద్‌పై 11-07 తేడాతో, నల్లగొండపై 16-07 పాయింట్లతో కరీంనగర్ జట్టు, కరీంనగర్‌పై 11-09 తేడాతో, ఆదిలాబాద్‌పై 13-05 తేడాతో, నిజామాబాద్‌పై 09-06 తేడాతో నల్లగొండపై 06-04 తేడాతో వరంగల్ జట్లు జైత్రయాత్ర కొనసాగించింది. ఆదివారం జరగనున్న సెమీస్‌లో ఆదిలాబాద్-కరీంనగర్, మెదక్-మహబూబ్‌నగర్ బాలికల జట్లు తలపడనున్నాయి. అయితే బాలుర జట్లు తలపడే సమయానికి ఫ్లడ్‌లైట్ల సమస్యతో నేటికి మ్యాచులు వాయిదా వేసినట్లు పీడీ నర్సింహ తెలిపారు.

అరకొర వసతుల మధ్య..
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ టోర్నీ అరకొర వసతుల మధ్య ప్రారంభమైంది. వివిధ ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో వసతి ఏర్పాటు చేయగా, క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోటీలను తిలకించడానికి వచ్చిన అభిమానులు, స్థానికులు కూర్చోవడానికి సరైన సౌకర్యాలు కరువయ్యాయి. వంటలు వండే ప్రాంతంలో పందులు స్వైరవిహారం చేస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.