కొల్లాపూర్, జనవరి 3 : అతడిని పేదరికం వెంటాడుతున్నా.. విధి వికలాంగుడిని చేసినా ఏనాడూ దిగాలు చెందలేదు.. కష్టాలు చుట్టిముట్టినా అధైర్యపడలేదు. ఆకలి పోరాటంలో ది వ్యాంగత్వం ఏపాటిదంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రెండు కాళ్లు లేకపోయినా ఆత్మైస్థెర్యంతో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు కొల్లాపూర్ పట్టణానికి చెందిన 56ఏండ్ల వయస్సు ఉన్న పోలేపల్లి బాలయ్య.కొల్లాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ గాంధీస్మారకోన్నత పాఠశాల పక్కనే ఉన్న మహేంద్ర కులానికి చెందిన పోలేపల్లి బాలయ్య ఎలాంటి భూమి లేదు. కులవృత్తిని నమ్ముకొని బుట్టల అల్లికలు, చాట్లు తయారు చేసి విక్రయించేవాడు. అయితే చాలీచాలని సంపాదనతో తాము బతుకలేమని భావించి 15ఏండ్ల కిందట భార్య, కొడుకుతో కలిసి హైదరాబాద్‌కు జీవనోపాధి కోసం వలస వెళ్లాడు.
దిల్సుఖ్నగర్ ప్రాంతంలో మసురాంబాద్లో ఓ అద్దె ఇంట్లో హోటల్ పెట్టుకొని సుమారు 200మంది కళాశాల విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పెడుతూ వారిచ్చే డబ్బులతో జీవనం సాఫీగా సాగిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో సుమారు పదేండ్ల కిందట తన రెండు కాళ్లకు వంటచెరుకులు స్వల్పంగా తాకడంతో క్రమేణా సెఫ్టిక్ అయింది. చికిత్స కోసం రూ.లక్షల్లో అప్పులు చేశాడు. అయితే శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉందని గ్రహించిన గాంధీ దవాఖాన వైద్యులు.. బాలయ్య రెండు కాళ్లను శస్త్రచికిత్స చేసి తొలగించారు. కాళ్లను కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. కొంతకాలం విరామం తీసుకున్న తర్వాత తన భార్య సహాయంతో హోటల్‌ను నడపసాగాడు. అక్కడ ఆర్థిక పరిస్థితులు కుదుట పడకపోవడంతో మనోవేధనకు గురయ్యాడు.
శరీరం సహకరించక సొంతూరుకు..
వయస్సు పెరుగుతుండడం, శరీరం సహకరించకపోవడంతో పోలేపల్లి బాలయ్య మూడేండ్ల కిందట కొల్లాపూర్‌కు చేరుకున్నాడు. పట్టణంలోని గాంధీ హైస్కూల్ పక్కన శిథిలావస్థలో ఉన్న చిన్నపాటి మట్టి ఇంటికి మరమ్మతులు చేయించి టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అరకొర సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న బాలయ్యకు ప్రభుత్వం ఆసరా పింఛన్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం తన వద్దనున్న ట్రైసైకిల్ ఏమాత్రం సౌకర్యవంతంగా లేదని, తనకు త్రిచక్ర వాహనం ఇవ్వాలని కోరుతూ ఇటీవల స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మీచారికి విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన చైర్పర్సన్.. వెంటనే బాలయ్య ఇంటికి చేరుకొని అతడి పరిస్థితిని తెలుసుకున్నారు. విషయాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి, కలెక్టర్ ఉదయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లి త్రిచక్రవాహనం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జీవనోపాధి నిమిత్తం ప్రభుత్వం రుణ సదుపాయంతోపాటు డబుల్బెడ్రూం ఇంటిని మంజూరు చేయాలని పోలేపల్లి బాలయ్య వేడుకుంటున్నాడు.