వెల్దండ, సెప్టెంబర్ 21 : తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతున్నదని, మోదీ సర్కార్ తీరును ఎండగట్టాల్సిన సమయం అసన్నమైనదని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి, మాజీ ఎంపీ మంద జగన్నాథం అన్నారు. గురువారం వెల్దండ మండల కేం ద్రంలో టీఆర్ఎస్ రాష్ట్ర నేత గోలిశ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే ప్రతి కార్యక్రమం ప్రజల కోసమేనని అన్నారు. సామాన్యుడికి ప్రతిఫలం అందాలన్నదే ఆయన సంకల్పమన్నారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులను మోదీ ప్రభుత్వం ఇవ్వకుండా అడ్డుకుంటుందని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పర్చడానికి కేంద్రం కుట్రలు చేస్తున్నదని, వారి ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. మత, కులతత్వ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎఫ్సీఐ నుంచి కొనుగోలు చేసే ధాన్యాన్ని ప్రైవేటు సంస్థలకు కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడం దుర్మార్గ చర్యగా పేర్కొన్నారు. దేశ సంపదను ప్రైవేటు సంస్థలకు అప్పన్నంగా దోచి పెట్టడానికి కేంద్రం కంకణం కట్టుకున్నదని మండిపడ్డారు. బీజేపీ హయాంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, దీంతో సామాన్యుల బతుకుబండి భారంగా మారిందన్నారు. సమావేశంలో సర్పంచులు భూపతిరెడ్డి, శ్రీనునాయక్, చెర్కూర్ ఉపసర్పంచ్ నరసింహా ముదిరాజ్, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు జంగయ్య, కొండల్, గజిని శ్రీను, దేవేందర్, టీఆర్ఎస్ తలకొండపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి, సుమన్, నాగిరెడ్డి, సతీశ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.