మల్దకల్, అక్టోబర్ 27 : మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన మైనర్ బాలిక వడ్డె రాజేశ్వరి(16) ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని బిజ్వారంలో మృతురాలు రాజేశ్వరి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు గొలుసు దొంగిలించిందని మైనర్ బాలిక రాజేశ్వరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరించడంతో ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. బంగారు దొంగతనం జరిగిన చోటు కాకుండా మల్దకల్ స్టేషన్లో కేసు పెట్ట డం ఏమిటని ప్రశ్నించారు. ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ విషయమై జాతీయ మానవ హక్కుల సంఘానికి, హోం సెక్రటరీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. నిందితులను అరెస్టు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు సుభాన్, ప్ర ధాన కార్యదర్శి బాలయ్య, కార్యదర్శులు లక్ష్మన్న, మహదేవ్, వెంకటేశ్, మహేశ్ పాల్గొన్నారు.