వనపర్తి టౌన్, ఆగస్టు 4 : విశ్రాంత ఉద్యోగులను విస్మరిస్తే ప్రభుత్వానికి పూర్తి విశ్రాంతి ఇస్తామని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం, కౌన్సిలర్ భారతి ప్రేమ్‌నాథ్‌రెడ్డిలు అన్నారు. మంగళవారం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో చేపట్టిన చలో బస్ భవన్ ముట్టడికి వెళ్తున్న జిల్లా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేసి పట్టణ ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన బకాయిలు రూ.900 కోట్లు వెంటనే విడుదల చేయాలని బస్‌భవన్ ముట్టడికి ప్రజాస్వామ్యయుతంగా పిలుపునిస్తే కనీసం మా ఆవేదనను వినిపించుకోకుండా వయోవృద్ధులు అని చూడకుండా అక్రమంగా అరెస్ట్‌లు చేయడం ఈ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమని అన్నారు.
2017 నాటికి రావాల్సిన ఆర్టీసీ బకాయిలు, గ్రాట్యూటీ బకాయిలు, పెన్షన్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఒక్కరికి రూ.15 లక్షల నుంచి రూ.20లక్షల బకాయిలు రావాలని మా పిల్లల ఉన్నత చదువుల కోసం, పెండ్లిళ్ల కోసం దాచుకున్న మా సొమ్ము మాకు ఇవ్వాలని కోరుతుంటే మమ్మల్ని అణిచివేయడం తగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మా కోరికలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చుతామని చెప్పి మమ్మల్ని మోసం చేయడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. బస్ భవన్ ముట్టడిని అడ్డుకొని అక్రమంగా అరెస్టులు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ హయాంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాకు అండదండగా నిలిచారని, మాకు ఎటువంటి ఆపద వచ్చినా ప్రభుత్వం దృష్టికి మా సమస్యలు పరిష్కరించారని, మాకు నూతన విశ్రాంతి భవనం నిర్మించి వసతి కల్పించారని గుర్తు చేశారు. కార్యక్రమం లో వాకిటి శ్రీధర్, సత్యన్న, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, అంజయ్య, ఉపేందర్, ప్రకాశ్, సత్యనారాయణగౌడ్, హుస్సేన్అలీ, స్వామి, రాఘవరెడ్డి, గాంధీ , కురుమన్న, రాంమూర్తి పాల్గొన్నారు.