మక్తల్ టౌన్/మక్తల్ అర్బన్, డిసెంబర్ 26 : మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన స్వామివారి రథోత్సవ కార్యక్రమం సందర్భంగా మంగళవారం మార్గశిర శుద్ధ పౌర్ణమిని పురసరించుకొని భక్తులు తమ ఇంటి ఇలవేల్పు అయినటువంటి పడమటి అంజన్నకు పిండివంటలతో దాసంగాలను సమర్పించి మొకులు చెల్లించుకున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూకట్టారు.
సాయంత్రం 3 గంటలకు పల్లకీసేవ, సాయంత్రం స్వామివారి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవం ప్రారంభానికి ముందు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికరెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తెలంగాణ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం అంతా హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వనజ, మున్సిపల్ చైర్పర్సన్ పావని, ఆలయ ఈవో శ్యాంసుందరాచారితోపాటు వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.