బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురవగా.. మంగళవారం ఉదయం నుంచి ముసురు ముంచెత్తింది. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇంకా వాగులు, వంకలు పొంగి పారుతున్నాయి. దీంతో పోలీసులు పలు గ్రామాలకు రాకపోకలు బంద్ చేయించారు. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. పాత ఇండ్లు కూలిపడ్డాయి.. ఇండ్లల్లోకి నీళ్లు చేరాయి. జనజీవనం స్తంభించిపోయింది.
వరద తాకిడికి మహ్మదాబాద్ మండలం మల్కచెరువు కట్ట కుంగిపోయింది. ఇరిగేషన్ అధికారులు సిమెంట్ బస్తాల్లో ఇసుక నింపి కట్టకు అడ్డుగా పేర్చారు. అడ్డాకుల మండలంలో రూ.4.60 కోట్లు వెచ్చించి రాచాల-గుడిబండ మధ్యలో పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం వాల్ కట్ట 2 నెలలకే కొట్టుకుపోయింది. మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లిలో హైవే-44 వద్ద నిర్మించిన అండర్‌పాస్ చిన్నపాటి వర్షానికి రాకపోకలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నిలిచిన నీటిని దాటుకుంటూ నిత్యం పాఠశాల చిన్నారులు ప్రమాదకరంగా వచ్చిపోతున్నారు. మక్తల్ మండలం రుద్రసముద్రం, కర్ని చెరువు అలుగునీటిని దాటి ఉపాధ్యాయులు, పీహెచ్సీ సిబ్బంది విధులకు హాజరయ్యారు.
– మహబూబ్‌నగర్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)