శుక్రవారం 05 జూన్ 2020
Mahabubabad - Feb 08, 2020 , 03:10:10

నేడు తల్లుల వన ప్రవేశం

నేడు తల్లుల వన ప్రవేశం

మేడారం బృందం- నమస్తే తెలంగాణ  : రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తుది ఘట్టం నేటితో ముగిసిపోనుంది. కోటిన్నర మంది భక్తుల మొక్కులు అందుకున్న జన దేవతలు సమ్మక్క-సారలమ్మ నేడు వన ప్రవేశం చేయనున్నారు. కాగా, జాతరకు మూడు నెలల ముందు నుంచే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టడంలో ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. కలెక్టర్ల బదిలీలు చోటు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి లోటుపాట్లు లేకుండా నాలుగు రోజుల జాతరను ముందుకు నడిపించింది. తల్లులు గద్దెలపైకి రాకముందు నుంచే భక్తులు లక్షలాదిగా తరలివచ్చి మొక్కులు సమర్పించారు. బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, గురువారం రాత్రి సమ్మక్క తల్లి చిలుకలగుట్ట నుంచి గద్దెలపై కొలువుదీరారు. దీంతో ఒక్కసారిగా భక్తులంతా మొక్కులు చెల్లించేందుకు బారులు తీరారు. గురువారం రాత్రి నుంచి మొక్కులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. మొక్కుల్లో భాగంగా శుక్రవారం రాష్ట్ర సీఎం కేసీఆర్‌, గవర్నర్లు తమిళీసై సౌందర్‌రాజన్‌, బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు తల్లులను దర్శించుకుని మొక్కులు సమర్పించారు. శుక్రవారం లక్ష్మీ వారంగా భావించే మహిళలంతా కూడా పెద్ద ఎత్తున తమ మొక్కులు, ముడుపులను సమర్పించారు. శుక్రవారం కూడా ఊహించని రీతిలో భక్తులు తరలివచ్చారు. మేడారం పరిసరాల్లోని ఊరట్టం, కాల్వపల్లి, నార్లాపూర్‌, రెడ్డి గూడెం, కొత్తూరు, కన్నెపల్లి తదితర గ్రామాల పరిసరాల్లో సుమారు ఏడు కిలోమీటర్ల దూరం వరకు భక్తులు విడిది చేశారు. వీరంతా గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు మొక్కులు సమర్పించి తిరుగు పయనమయ్యారు. 

సాయంత్రం వన ప్రవేశం 

ఇక శనివారం ఉదయం సమ్మక్క సారలమ్మ పూజారులు గిరిజన సంప్రదాయ పద్దతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో పూజారులు గద్దెలపై ప్రత్యేక పూజలు చేపట్టి, డోలు వాయిద్యాల మధ్య పూజారి కొక్కెర కృష్ణయ్య సమ్మక్క తల్లిని కుంకుమ భరిణె రూపంలో చిలుకలగుట్ట పైకి తీసుకుపోనున్నారు. అదే విధంగా పూజారి కాకా సారయ్య సారలమ్మను కన్నెపల్లిలోని గుడికి తీసుకెళ్లనున్నారు. పగిడిద్దరాజును గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజులను ఏటూరునాగారం మండలం కొండాయిలోని ఆలయానికి ఆయా పూజారులు తీసుకుపోనున్నారు. అయితే సాయంత్రం జరిగే కార్యక్రమాన్ని గ్రామస్తులు, ఆదివాసీలు, భక్తులు ఆసక్తిగా తిలకించనున్నారు. ఇక దేవతలు వనప్రవేశం చేసిన తర్వాత కూడా తల్లులకు మొక్కులు సమర్పణ అదేస్థాయిలో కొనసాగనుంది. 


logo