‘నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా’ (వాగ్దానం)
సాహిత్య సంగీత సమ్మేళనమే పాట. ఎన్నో మనోభావాల ఊట. మనసు చెప్పే భావం పాట. ఊహకందని భావం పాట. సుతిమెత్తని పెదవులపై తొణికిసలాడే రాగం పాట. అలాంటి పాటల పూదోట మాలిగా దాశరథి చిరకీర్తి పొందారు. 1960లో ఆచార్య ఆత్రేయ స్వీయ దర్శకత్వంలో ‘వాగ్దానం’ అనే చిత్రం నిర్మిస్తూ వివిధ కవులచే పాటలు రాయించుకోవాలని ముచ్చట పడ్డారు. ఆ కవులు మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆ తర్వాత ఆరుద్ర అనుకున్నారు. ఆరుద్ర పని ఒత్తిడిలో రాయలేకపోయారు. దాంతో అప్పటికే కవిగా సుప్రసిద్ధుడైన దాశరథిని హైద్రాబాద్ నుంచి మద్రాసుకు ఆహ్వానించి ఆయన చేత ఓ బహుచక్కటి పాట రాయించారు. ఆ మొదటి పాటతోనే ఆయన అపారమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు.
‘ఆధాహై చంద్రమా రాత్ ఆధీ’ అనే పాట బాణీలో రాసిన పాట అది. దీనికి ట్యూన్ చేసింది సుప్రసిద్ధ సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు. ఈ పాట ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేసింది. మల్లెల సుగంధం గుబాళింపజేసింది. వలపు రాగాలతో స్వర్గాలకు పూలదారులు వేసింది. తియ్యని స్వప్నాల తేలించి తీపి బంధాలతో అందాలను అల్లుకుపోయింది.
‘రంగులరాట్నం’ చిత్రం ఎన్నో ప్రత్యేకతలు నింపుకుంది. అందులోని చాలా పాటలు దాశరథి రాసినవే. అందులో ‘వైష్ణవ సంప్రదాయంలో పురుషకారం’ పద్ధతిలో రాసిన పాట ఒకటుంది. అమ్మవారి ద్వారా స్వామికి నివేదనలు పంపించడం అనేది దాని ప్రత్యేకత. స్వామివారికి సూటిగా నివేదించకుండా ఇలా చేయడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. పాట పల్లవి ‘నడిరేయి యేజాములో’ . ఘంటసాల, జానకి స్వరంలో అత్యంత ప్రజాదరణ పొందింది ఆ పాట. అలివేలు మంగమ్మ ద్వారా వెంకటేశ్వర స్వామిని వేడుకున్న తీరు అద్వితీయం.
‘మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ- ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా’ అంటూ భక్తుల ఆర్తిని అద్భుతమైన రీతిలో అక్షరీకరించారు దాశరథి. అంతకుముందు కృష్ణశాస్త్రి వంటి దిగ్దంతులతో పాటలు రాయించుకున్న దర్శకులు బీఎన్ రెడ్డి అంత గొప్పగా పాట రాసినందుకు దాశరథిని ఎంతగానో ప్రశంసించారు. సంగీత దర్శక ద్వయం గోపాలం, ఎస్.రాజేశ్వరరావు ట్యూన్ కట్టారు. ఈ పాట తెలుగువారి గుం డెల్లో గూడు కట్టుకుంది. కథా సంవిధానంలో ఆ భావ వ్యక్తీకరణలో సంపూర్ణంగా సఫలత సాధించుకుంది. ఈ పాటలో కవి స్వామిని ప్రశ్నిస్తారు. సున్నితంగా మందలిస్తారు –
‘కలవారినే గాని కరుణించలేడా?
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనినాడు
స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా’
‘మనసు మాంగల్యం’లో దాశరథి భావ, విప్లవ అభ్యుదయాలకు ప్రతీకలుగా నిలిచే మూడు విభిన్నమైన పాటలు రాశారు. ‘ఏ శుభ సమయంలో’ అనే పాట భావకవితా సౌరభాలతో సాగుతుంది. ఘంటసాల, సుశీల గళాలు ఆ యుగళగీతంతో ఉయ్యాలలూపాయి. ‘ఆవేశం రావాలి’ ఈ పాట విప్లవ చైతన్యానికి ప్రతీక. ఈ పాటలో కవి తన గతకాలపు చేదనుభవాలు, పోరాటాల ప్రభావంతో రాసిన ఛాయలు దర్శనమిస్తాయి.
‘గుండెలోని గాయాలు- మండించే గేయాలు
వేదనలై శోధనలై
రగలాలి విప్లవాలు’
అంటూ ఆవేశంలో ఊగినా, వేదనలో సాగేదే జీవితం అంటూ జీవితానికి ఒక చక్కటి నిర్వచనం ఇచ్చినా దాశరథికే చెల్లింది. చక్కటి తాత్తికతకు ఆ పాట ఓ నిదర్శనం. చక్కటి సందేశం కూడా ఇమిడి ఉంది. కర్తవ్యాన్ని ప్రబోధించే ఈ గీతం చైతన్యాన్ని రగిలించేలా రాశారు దాశరథి.
‘ఒకే కుటుంబం’ చిత్రంలో వ్యక్తి నైతికత పతనమై వ్యవస్థకు కుళ్లిపోయి ఒక బదులు లేని ప్రశ్నగా మారినప్పుడు పడే వేదనను తెలిపే పాట ఒకటుంది. మానవ నడవడే ఓ సమస్యగాను మారినప్పుడు అది ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో కవి చక్కగా చెప్పారు. ఇందులో పల్లవే మందలింపుగా ఉంటుంది-
‘మంచిని మరచి- వంచన చేర్చి
నరు డే ఈనాడూ – వానరుడైనాడు’
మానవుడు ఎంత చదివినా, విజ్ఞానఖని అయినా తన నైతిక విలువల నుంచి దూరం కాకూడదనే సందేశం ఇందులో కన్పిస్తుంది. మనిషిని మనిషి దోపిడీ చేస్తూ ఎంతగా అమానవీయతను పంచుతున్నాడో చెంపదెబ్బ కొట్టినట్టు రాశారు దాశరథి..
‘అందరి చెమట చిందించాడు
సంపద ఎంతో పెంచాడు
పంపకమంటూ వచ్చేసరికి
అంతా తనదే అన్నాడు’
‘మమతను మరిచి – మనసును విడిచి’ అంటూ దోపిడీని ఎండగట్టారు. జాతియావత్తు సౌఖ్యంగా ఉండాలంటే ధర్మమార్గంలో నడవాలని తెలియజేస్తారు కవి.
ఇదివరకటి సినిమాల్లో వీణ పాటలు ప్రత్యేకమైనవి. అవి ఆయా సందర్భాలను బట్టి వివిధ రసాలను ఒలికిస్తాయి. అంతకుపూర్వం శ్రీశ్రీ పాట ‘పాడవేల రాధిక – ప్రణయ సుధా గీతిక’ పాట రాశారు. ఆరుద్ర ‘మంచి కుటుంబం’ చిత్రంలో ‘మనసే అందాల -బృందావనం’ పాట రాశారు. ఆత్రేయ ‘పాడమని నన్నడగవలెనా’ పాట గొప్పగా రాశారు. అన్నీ జనాదరణ పొందినవే. ఆ తర్వాత వీణ పాటకు దాశరథి పర్యాయపదంగా మారడం విశేషం. ‘పూలరంగడు’లోని ‘నీవు రావు నిదురరాదు’, ‘రెండు కుటుంబాల కథ’లోని ‘వేణుగాన లోలుని గన – వేయి కనులు చాలవులే’, ‘అమాయకురాలు’ చిత్రంలోని ‘పాడెద నీ నామమే – గోపాలా’, ‘ఆత్మీయులు’ చిత్రంలో ‘మదిలో వీణలు మ్రోగే-ఆశలెన్నొ చెలరేగె’, ‘అంతా మనమంచికే’ సినిమాలోని ‘నేనె రాధనోయి – గోపాలా – అందమైన ఈ బృందావనిలో’ గీతాలు దాశరథి రచనా ప్రతిభకు గీటురాళ్లుగా నిలిచాయి. ఇవన్నీ సంగీత సాహిత్యాల మధురాతి మధుర సమ్మేళనంగా రూపొంది ప్రజాదరణకు నోచుకున్నాయి. ఈ పాటలన్ని దాశరథికి మంచిపేరు తెచ్చిపెట్టాయి. సుమారుగా అన్ని పాటలకు సాలూరు రాజేశ్వరరావు బాణీలే అఁదమైన అలంకరణగా నిలిచాయి.
‘శ్రీదేవి’ చిత్రంలో ‘రాశాను ప్రేమలేఖలెన్నో – దాచాను ఆశలన్ని నీలో’, ‘అమరశిల్పి జక్కన’లోని ‘అందాల బొమ్మతో ఆటాడవా’ వంటి పాటలు దాశరథి వైవిధ్య వైభవానికి అద్దం పడతాయి. ‘కన్నెవయసు’లోని ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ అనే పాట బాలసుబ్రహ్మణ్యంకు పేరు ప్రఖ్యాతులందించింది. ఆ రోజుల్లో యువతను పట్టి ఊపేసిన పాట ఇది. శృంగార గీతాలు రచించడంలో దాశరథిది అందెవేసిన చెయ్యి. దాశరథి స్త్రీల పరంగా రాసినవి చాలా ఉన్నాయి. కవి వారి పక్షాన నిలిచి, వారికి సానుభూతి చూపి, ఆత్మైస్థెర్యాన్ని పెంచుతాడు.
‘కన్నె మనసులు’ చిత్రంలో ‘గాజులమ్మ’ అనే 15 నిమిషాల కథాగీతిక ఉంటుంది. జానపద రీతిలో సాగిన ఈ పాట బహుళ ప్రజామోదాన్ని పొందింది. ‘మీనా’ చిత్రంలో ‘మల్లెతీగ వంటిదీ – మగువ జీవితం’ పాట స్త్రీ జీవితానికి చక్కటి వివరణ. జన్మను ఇచ్చి జాతిని నిలిపే జననియె జాతికి ఆధారం అంటాడు కవి.
‘పదండి ముందుకు’ చిత్రంలోని ‘మేలుకో – సాగిపో – బంధనాలు తెంచుకో – బరువులు – బాధలు అందరితో పంచుకో’ అనే పాటలో స్వాతంత్య్ర పరిరక్షణ గురించి రాశారు. ఉర్దూలో నిష్ణాతుడైన దాశరథి ‘ఇద్దరు మిత్రులు’లో ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ’ అనే పాటలో కొన్ని ఉర్దూ పదాల భావ సమైక్యతతో చేకూర్చబడినవి. ఆనాటి చలనచిత్ర సంగీత దిగ్గజాలైన సాలూరి, ఆశ్వత్థామ, పెండ్యాల, వేణు, ఘంటసాల, సత్యం, కోదండపాణి, ఆదినారాయణరావు, కె.వి.మహదేవన్ వంటివారు దాశరథి పాటలకు బాణీలు కూర్చారు. దాశరథి పాటలు ఘంటసాల, పి.సుశీల, జానకీ, జిక్కి, పి.లీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీబీ శ్రీనివాస్, మాధవ పెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు గొంతులలో పడి జనాదరణకు నోచుకున్నాయి.
ఆయన సినిమా సన్నివేశాలకు అనుగుణంగా పాటలు రాసినా అవి వాటిలోని తాత్వికత వల్ల సార్వకాలీనతను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. జీవన సూత్రాన్ని అన్ని కాలాలకు, అన్ని ప్రదేశాలకు వర్తించేలా నిలుస్తాయి. జీవితాన్ని హ్యూమనిజంతో మేళవించాలని నిరంతరం ప్రబోధిస్తూనే ఉంటుంది ఆయన పాట.