ఎన్నో త్యాగాలు చేసి ఒక సామూహిక కలను సాకారం చేసుకున్న దశాబ్ధాలుగా పొక్కిలైన నేల మీద హరిత స్వప్నాన్ని నిజం చేశా! ఒక్క వాన చినుకు కోసం తడారిన గొంతుతో తల్లడిల్లిన మట్టి దాహం తీర్చి దేశానికిప్పుడు ధాన్యాగారాన్నిరాసిచ్చా! గుడ్డి దీప కాంతిని చేతబూని ఈ తొమ్మిదేళ్ళలో రాష్ట్రాన్ని మిరిమిట్లు గొలిపే నక్షత్ర శాలను చేశా! నా ఈ వెలుగులు దేశ సరిహద్దులు దాటి ప్రసరిస్తుంటే సహించలేని దిష్టి కళ్ళు కొన్ని నేను జారి పడితే నవ్వాలని నిత్యం ఎదురు చూస్తున్నాయి ఏమరు పాటుతో అడుగేస్తానేమోనని దారెంట అరటి తొక్కలు విసిరేస్తున్నాయి కాళ్ళ నడుమ కట్టెల మండీలు మొలిపిస్తున్నాయి! పోరు బాటలో ఎన్ని ఎత్తు పల్లాలు చూడ లేదు? నిప్పుల మీద నడిచిన చరిత్ర నాది చావు నోట్లో తల పెట్టిన తెగువ నాది నాకు బాగా తెలుసు ఎదగడం నల్లేరు మీద నడక కాదు అట్లని బెదరడం నా రక్తంలో లేదు! ఆకలి తెలిసిన దాన్ని దాహం ఎరిగిన దాన్ని నేను మాత్రమే కాదు సమస్త భారతాన్ని స్వర్గ తుల్యం చేయాలని కలగంటున్న! నదులు సముద్రాలు గిరులు అనంత సిరులు తరగని అపారమైన మానవ వనరులు అంది పుచ్చుకోనంత కాలం దేశ ప్రగతి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు! దిష్టి కళ్ళకు కూల్చడమే తెలుసు నాకు నిర్మించడం ఎరుక నిర్లక్ష్యం బాధ్యతా రాహిత్యం బూజు దులపందే అంతా కలిసి బ్రతికి ఎదగందే నవ్య భారతం హిమాలయంలా తలెత్తుక నిలబడదు! నేనిప్పుడు ఆపనిలోనే ఉన్న ఎప్పటిలా పిడికెడు విశ్వాసాన్నివ్వండి కొండల్ని పిండి చేస్తా! విశ్వ వేదిక మీదా జాతి వెలగునై నిలబడతా!! - కోట్ల వనజాత 94402 33261.