తల్లి పేగును తెంపే నాభి పురి
బతుకుదారికి తీర్పు తొలి తాడు
ప్రేమ పాశాల దీర్చ దిష్టి తాడు
మురిపాల మొలతాడు ప్రతిబింబాలు
గడపగడపకో కథ.. గుండె గుండెదో వ్యథ
పోలికలనిచ్చేటి రక్త పోగుల కథ!
వ్యథ తీర్చే తాడు నల్లదో ఎర్రదో
బిళ్ళనో ముద్రనో కంఠాన కట్టు
బాలారిష్టాలు కన్నోళ్ళ కష్టాలు కంటిపాపయి నిలుచు!
మనం మనమనే మతలబుల మతాలు
ముళ్ళు అంటేనే తాళ్లు.. దండలలో దారాలు
అన్నాచెల్లెళ్ల అక్కాతమ్ముళ్ల చేతికట్టు దారాలు
రాగాలు దీసే రాఖీల తాళ్ళు
పెళ్లి పేరంటాల పెద్ద ముచ్చట్లు
చూడొక్కతరమా? చూపొక్కతనమా?
సూత్రధారులు ఎవరైనా పాత్రధారులు ఎవరైనా
నుదుట బాసింగాల కలల తాళ్లు కంఠాల సూత్రాలు
విఫల వైరుధ్యాల తెగింపు తాళ్లు
మట్టివో గట్టివో క్షుద్బాధ దీర్చే మృణ్మయ పాత్ర హిరణ్మయ పాత్ర
సత్తు గిన్నె అతుకుల బొంతల
నూరేళ్ల నడక స్వర్గానికో నరకానికో!!
కాలం గాలానికి చిక్కే మనిషి
క్షణికావేశాలు అహమహ తత్వాలు
కోప క్రౌర్యాల ముకుతాళ్లు
నరహంతకుల తలలకు వేలాడు ఉరిశిక్షల తాళ్లు
మోయలేని భారాల విముక్త మార్గాల ఉరితాళ్ళు
శరీరం నుంచి హంస ఎగిరిపోయాక
కాలివేళ్ళకు కట్టే చిట్టచివరి తాడు!
మోతకూ మేతకూ పేనబడిన తాళ్లు పేనని తాళ్లు
కనిపెట్టలేని యమ పాశం
పూరిగుడిసె పెద్ద ఇల్లు జీవి జననమరణాల దారి
పులుగు ఎగిరినట్లు పుటుక్కుమన్నట్లు
పురి పేనుకున్న ఈ లోకరీతి
ఒక్కడిగా వచ్చేటి ఒక్కడిగా పోయేటి
బొంది ఉన్నంతవరకు అందివచ్చే తాడు
తాడు ఒక్కటే రూపాలెన్నో!!
-డాక్టర్ కొండపల్లి నీహారిణి
98663 60082