దేశ కాలమాన పరిస్థితుల్లో ఉద్యమాలపై ఉధృతమైన దమనకాండ అమలవుతున్నది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాస రచయిత ఆనాడు లిబియాలో జరిగిన తిరుగుబాటును గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యంగా ఒమర్ ముఖ్తార్ చేసిన గెరిల్లా పోరాటం, అంతిమంగా శత్రువులకు చిక్కి ఆయన ఉరికంబం ఎక్కిన నేపథ్యంతో 80వ దశకంలో వచ్చిన Lion of the Desert సినిమాలోని ఘట్టాలను వివరించారు. పోరాటాలు, త్యాగాల ప్రాసంగికతను మననం చేసుకుంటున్నారు.
ఆంథోనీ క్విన్ ముఖ్య పాత్రలో లిబియా దేశ తిరుగుబాటు వీరుడైన ‘ఒమర్ ముఖ్తార్’ జీవిత పోరాటం ఆధారంగా నిర్మాణమైన Lion of the Desert 1981, ఏప్రిల్ 17న విడుదలైన లిబియా దేశపు చలనచిత్రం. ఈ సినిమా ఒమర్ ముఖ్తార్ జీవితం, విలువ లు, నైతికత, తిరుగుబాటు, త్యాగాన్ని ప్రతిష్ఠాత్మకంగా చూపిస్తుంది. ఈ చిత్రానికి ముస్తఫా అక్కడ్ దర్శకత్వం వహించగా కల్నల్ మువామర్ గడాఫీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలందుకున్నది. ఇప్పుడొకసారి ఆ సినిమాలోకి వెళ్దాం.
రోమ్ సామ్రాజ్య పునరుద్ధరణ పేరుతో లిబియాను ఆక్రమించుకోవాలనే ప్రణాళిక ఇటలీ నాయకుడు ముస్సోలినిది. అందులో భాగంగానే లిబియా సంస్కృతిని, గిరిజన జీవనాన్ని నాశనం చేస్తాడు. అయితే, స్థానిక మత పండితుడైన ఒమర్ ముఖ్తార్ పాఠశాలలో చదువు చెప్తూ, పాలనా వ్యవస్థలను విమర్శిస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఇటాలియన్ దమనకాండ ప్రారంభమవుతుంది. ఆ దమనకాండను తుత్తునియలు చేసేందుకుగాను తిరుగుబాటు ఉద్యమానికి నాయకత్వం వహిస్తాడు స్థానిక సనూసి తెగకు చెందిన ఒమర్ ముఖ్తార్. ఆయన వయస్సు 50 ఏండ్లు.
గెరిల్లా పోరాటం ప్రారంభమవుతుంది. పొలాలు, ఎడారులు, కొండలే ఆ రణరంగాలు. సనూసి పోరాటకారులు గెరిల్లా వ్యూహాలతో ఇటాలియన్ సైన్యంపై చిన్న చిన్న దాడులకు తెగబడుతారు. తమకున్న భౌగోళిక పరిస్థితులపై అవగాహన, ప్రజల మద్దతు, శత్రు స్థావరాలపై రాత్రి చేసే దాడులతో ముస్సోలిని గజగజా వణికిపోతాడు. ‘వారు బలవంతంగా మన భూమిని తీసుకుంటారు కానీ, మన మనసును ఎలా గెలవగలుగుతారు?’ అనే ప్రకటనతో సినిమా ప్రారంభమవుతుంది.
ఒమర్ ముఖ్తార్ ‘ఈ భూమి మనది. దానిని రక్షించడం మన కర్తవ్యం. దానికోసం తిరుగుబాటు చేయడం ప్రతీకారం కాద’ని చెప్తాడు. ఒక వృద్ధ నాయకుడు, పరిమిత ఆయుధాలతో, ప్రపంచ శక్తులైన ఇటలీని ఇరకాటం పెడుతుంటే షాక్‌కు గురవడం ఇటలీ వంతవుతుంది. ఇటాలియన్ జనరల్స్ ఆశ్చర్యపోతారు. అందులోని ఒక అధికారి ‘మేము ఆయన్ని చంపలేకపోతున్నాం. ఇక అతని ఆలోచనలను ఎలా చంపగలం?’ అని గొప్పగా చెప్పడంతో.. బలమైన తిరుగుబాటు నాయకుడిగా, ధిక్కార నేతగా ఒమర్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ఒమర్ పాచికలు అర్థం చేసుకోలేని ముస్సోలిని క్రూరమైన, ఫాసిస్టు జనరల్ గ్రాజియానిని రంగంలోకి దింపుతాడు. గ్రాజియాని లిబియాకు చేరడంతో కథ మలుపు తిరుగుతుంది.
‘లిబియాను మనం గెలవాలి’ అన్న ముస్సోలినికి ‘లిబియన్లను లొంగిపోయేలా చేస్తాను. ఇందుకోసం దయా, దాక్షిణ్యాలను కూడా పక్కనపెడుతా’ అని గ్రాజియాని మాటిస్తాడు. ఈ నేపథ్యంలోనే కథ మరింత హింసాత్మక దిశలోకి ప్రవేశిస్తుంది. గ్రామాలను దహనం చేయడం, ప్రజలను బంధించడం గ్రాజియాని చేసే సామూహిక శిక్షా విధానం. ఆ హింసను చూడలేక ‘మనం ఒక ప్రాంతంపై యుద్ధం చేస్తున్నామా? లేక బలహీనులను బలిస్తున్నామా?’ అని ఒక ఇటాలియన్ అధికారి గ్రాజియానిని ప్రశ్నిస్తాడు. అందుకు గ్రాజియాని ‘ఇది యుద్ధం కాదు, చంపడమే’ అని జవాబిస్తాడు.
ఒమర్ నాయకత్వంలో పనిచేసే తిరుగుబాటుదారులకు ఆహారం కరువవుతుంది. వాళ్లకు తాగడానికి నీళ్లు కూడా దొరుకవు. ఎడారి ప్రాంతాల్లో సామాన్య ప్రజలు బందీలుగా మారుతారు. ఈ క్రమంలో ‘ఇక్కడ ప్రజలే సైన్యం. తిరుగుబాటు సైన్యం, సామాన్య ప్రజలు వేరు కాదు. కాబట్టి లిబియాను ఓడించాలంటే లిబియన్లను సమూలంగా నిర్మూలించాలి’ అనే భారీ డైలాగ్ చూపరులకు భయాన్ని కలిగిస్తుంది. ‘మనం చేసే పోరాటం ఇప్పుడు మన స్వాతంత్య్రం కోసమే కాదు, అది మన ప్రజల ప్రాణాల కోసం చేస్తున్న పోరాటం’ అని ఒమర్ చెప్పడంతో ప్రేక్షకులు ఊపిరిపీల్చుకుంటారు. కానీ, తిరుగుబాటుదారులకు ఎలాంటి వస్తువులు, తిండి పదార్థాలు అందకూడదని సామూహికంగా ఒంటెలను చంపివేస్తారు. ‘వారి కాళ్లను నరికితే, వారి పోరాటం నడువదు’ అని గ్రాజియాని ఇటాలియన్ సైనికులకు చెప్తే.. ‘ వారు మూగ జంతువులను చంపారు. కానీ, మనలోని మానవత్వాన్ని కాదు’ అని ఒమర్ ముఖ్తార్ తిరుగుబాటుదారులకు దిశానిర్దేశం చేస్తాడు. గ్రాజియాని భారీ యుద్ధట్యాంక్‌లు, మెషిన్ గన్స్, వైమానిక బాంబులతో దాడి చేస్తాడు. ఒమర్ ముఖ్తార్ ధైర్యం తగ్గకపోయినా, ప్రజలు మాత్రం మరణాలు, ఆహార కొరతలతో నలుగుతారు.
‘మనం వేల మందిని చంపినా.. అతను మాత్రం ఇంకా బతికే ఉన్నాడు’ అని ఇటాలియన్ అధికారులు పళ్ళు కొరుకుతుంటారు. ‘నేను ఓడిపోవడానికి కాదు, నా ప్రజలను నిలబెట్టడానికి పుట్టాను’ అనేది ఒమర్ సమాధానం.
వయస్సు పెరుగుతున్నా, ఆయనలో ధైర్యం ఏ మాత్రం తగ్గదు. దీంతో ఇటాలియన్ సైన్యం సాంకేతికంగా, వ్యూహాత్మకంగా అత్యంత బలంగా తయారవుతుంది. ఇసుక తుఫాన్ల మధ్య, ఆహార, నీటికొరతతో లిబియన్లు బలహీనపడతారు. కాన్సంట్రేషన్ క్యాంపుల్లో కొందరు రోగాలపాలై చనిపోతారు కూడా. ‘మన శరీరం అలసిపోతుంది. కానీ, మన ఆత్మ రాన్రాను గట్టిపడాలి’ అని ఒమర్ తన యోధులకు చెప్తాడు. ఆయనకు ఆయుధాల కొరత ప్రధాన సమస్య కాదు. ప్రజలను బంధించిన శిబిరాలే యుద్ధ స్థావరాలుగా మారకపోవడమే అసలు సమస్య. ఈ తరుణంలోనే ఒమర్ ముఖ్తార్ ఇటాలియన్ సైన్యానికి పట్టుబడుతాడు. ఆ రోజు రాత్రి ఒక తీవ్ర యుద్ధం జరుగుతుంది. ఇటాలియన్ దళాలు వలయాకారంగా ముట్టడించి, ముఖ్తార్ తప్పించుకునే మార్గాలను మూసివేస్తారు. ఇటాలియన్ల కాల్పులతో ముఖ్తార్ గుర్రంపై నుంచి జారిపడుతాడు. ప్రాణాలతోనే ఇటాలియన్ సైన్యానికి చిక్కుతాడు. అతనిని చూసిన సైనికులు ఆశ్చర్యపడుతారు. ‘ఇతనెవరు?’ అని సైనికులు అడిగితే, ‘అసలు ఇతడే ఎడారి సింహం ఒమర్ ముఖ్తార్!’ అని ఓ సైనికాధికారి సమాధానం చెప్తాడు. అతన్ని చూసిన గ్రాజియాని ‘నేను ఊహించిన దానికంటే నీవు వృద్ధుడిగా ఉన్నావు’ అనడంతో.. ఒమర్ ‘యుద్ధం వయస్సుతో కాదు, న్యాయంతో జరుగుతుంది’ అని ప్రశాంతంగా సమాధానం చెప్తాడు.
ఆ తర్వాత మిలిటరీ కోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. ఒమర్ ముఖ్తార్‌ను ట్రయల్ కోసం పెద్ద కోర్టు హాల్లో నిలబెడతారు. అతడిని ఒప్పించడానికి కొందరు ఇటాలియన్ మంత్రులు.. ‘మీరు వృద్ధులు ఇంకా బతుకవచ్చు. పోరాటం ఆపండి, మేము మీకు సుఖంగా బతుకడానికి అన్ని వసతులు ఇస్తాం’ అని ఆఫర్ చేస్తారు. ఒమర్ నా బతుకును కొనగలరేమో కానీ, నా ఆత్మను కాదు. నేను లొంగిపోను. మేం గెలుస్తాం లేదా చచ్చిపోతాం. అంతేకానీ లొంగి పోం. మేం చచ్చిపోతే మా పిల్లలు, వాళ్ల పిల్లలు, వాళ్ల వాళ్ల పిల్లలు యుద్ధం చేస్తూనే ఉంటారు. మేం గెలిచే వరకు’ అని ఒమర్ ధిక్కారస్వరం వినిపిస్తాడు. దీంతో ‘మీరు మా ప్రభుత్వానికి వ్యతిరేకి! మీరు వేల మందిని చంపారు!’ అని గ్రాజియాని కోపంతో ఊగిపోతుంటాడు. అయినా ఏ మాత్రం భయపడకుండా ఒమర్ ‘ మా భూమిని ఎవరు ఆక్రమించారు? నేనా? లేక మీరా?’ అని ప్రశాంతంగా గ్రాజియానిని ప్రశ్నిస్తాడు.
ఉరితీసే ముందురోజు రాత్రి న్యాయమూర్తి చివరి మాటలు ఇలా ఉంటాయి. ‘మరణదండనకు ముందు చివరగా మీరు చెప్పేదేమైనా ఉందా?’ అని ముఖ్తార్‌ను న్యాయమూర్తి అడుగుతాడు. ‘మా హక్కుల కోసం పోరాడిన ప్రతి బిడ్డను నన్ను మించినవాడిగా దేవుడు సృష్టించాలి. మీరు ఒక్క మనిషిని ఉరి తీయవచ్చు. కానీ, ఒక జాతి సంకల్పాన్ని మాత్రం కాదు’ అని ధీరునిగా సమాధానం చెప్తాడు. ఆయన మాటలతో కోర్టులో ఉన్న లిబియన్ బందీలు కన్నీరు మున్నీరవుతారు. ఒక మహిళ నిదానంగా.. ‘అతన్ని చంపినా ఈ పోరాటాన్ని మేం ఆపబోము’ అని దృఢంగా చెప్తుంది.
ఒమర్ ముఖ్తార్‌ను ఒంటరిగా ఒక చిన్న గదిలో బంధిస్తారు. వేలాది లిబియన్లు ఆర్తనాదాల మధ్య ముఖ్తార్ మాత్రం ప్రశాంతంగా కూర్చుంటాడు. ఆయన్ను అలా చూసిన ఒక ఇటాలియన్ సైనికుడు ‘నీవు నేరస్థుడివి కాదు, ఒక వీరునివి. కానీ, నేను విధి చేతిలో బందీ అయిన సైనికుడిని’ అంటూ భావోద్వేగానికి లోనవుతాడు. ‘అసలైన బంధనం గొలుసులలో కాదు, అన్యాయం చేసే మనసులో ఉంటుంది’ అని చిరునవ్వుతో అతనికి సమాధానం చెప్తాడు ఒమర్. అప్పుడే ఉరితీసే సన్నివేశం వస్తుంది.
ముస్సోలిని ఆదేశాల ప్రకారం ప్రజల ముందు ముఖ్తార్‌కు ఉరిశిక్ష అమలు చేయాలి.
సూర్యుడు మబ్బులను చీల్చుకుంటూ బయటికి వస్తుంటాడు. వందలాది ఇటాలియన్ సైనికుల మధ్య, గ్రామాల నుంచి బలవంతంగా తీసుకువచ్చిన వేలాది లిబియన్ పౌరులు తమ నాయకుడిని చివరిసారి చూడటానికి నిల్చొని ఉంటారు. గ్రాజియాని చివరి ప్రయత్నంగా..‘క్షమాపణ చెప్పు’ వదిలివేస్తాం. నువ్వే కాదు, నీ ప్రజ లూ బతుకుతారు’ అంటాడు. ఒమర్ ముఖ్తార్ ధైర్యం గా.. ‘నేను, నా ప్రాణం కోసం అడగడం కాదు, నా ప్రజ ల గౌరవం కోరుతున్నాను. నేను నా దేశం కోసం చనిపోతున్నాను. మీరు ఏదో ఒకరోజు పశ్చాత్తాపపడతారు’ అని క్షమాపణలు కోరనని పరోక్షంగా బదులిస్తాడు. ‘మనం ఓడిపోలేదు, మనం గర్వంగా నిలబడ్డాం’ అని ఉరికంబం వద్ద ఉన్న ముఖ్తార్ ప్రజలతో ఆఖరిసారి అం టాడు. చిక్కని నిశ్శబ్దం. చిన్నగా లోలోపల అణచుకొని ఏడుస్తున్న శబ్దాలు. వందలాది పురుషులు, మహిళలు, పిల్లలు. ఇటాలియన్లు ముఖ్తార్‌కు ఉరిశిక్ష వేస్తారు. లిబియన్ల హాహాకారాలు, శోకాలు మిన్నంటుతుండగా ఇటాలియన్ అధికారులు అక్కడినుంచి వెళ్లిపోతారు.
ఒమర్ ముఖ్తార్ మరణం ప్రపంచ వార్తల్లో ప్రధాన శీర్షిక అవుతుంది. యూరప్‌లో కొంతమంది ఆయన మరణాన్ని ఫాసిజానికి సాక్ష్యంగా, పతనానికి ప్రారంభంగా చూశారు. ఇటలీ పౌరులు, విద్యార్థులు గ్రాజియాని, ముస్సోలిని చర్యలను విమర్శించారు. ఒమర్ ముఖ్తార్ మరణం తర్వాత లిబియన్ ప్రజలు మరింత ఏకమయ్యారు. గెరిల్లా పోరాట పద్ధతులు అభివృద్ధి చెందినయి. ముస్సోలిని పాలన తర్వాత తిరుగుబాటు ఉద్యమాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. లిబియా చివరగా 1951లో స్వాతంత్య్రాన్ని సాధించింది. ఒమర్ పోరాటం ఒక్క లిబియాకే కాదు, ప్రపంచంలోని ప్రతి వలస దేశ ప్రజలకు ధైర్యాన్నిచ్చింది.
‘మా హక్కుల కోసం పోరాడిన ప్రతి బిడ్డను నన్ను మించినవాడిగా దేవుడు సృష్టించాలి. మీరు ఒక్క మనిషిని ఉరి తీయవచ్చు. కానీ,
ఒక జాతి సంకల్పాన్ని మాత్రం కాదు’
-వెంకటకిషన్ ఇట్యాల
99081 98484