పొద్దున్నుంచి ఒకటే ఏడుపు
ఫలానా అని తెలియనితనం
జన్నయ్య డాక్టరే గొప్పోడు అప్పట్లో
ఎవలకి ఏమి వచ్చినా వో తెల్లగోలో
ఎర్ర మందో బల్మీటికి ఓ సూదో
వేళకు గాయన కూడా లేడాయే
ఏడుపు పెరుగుతాందే గాని తగ్గలే
బాపమ్మతో ఉన్న సాయితవ్వలు
ఒళ్లు పట్టించాలనే ముచ్చట్లు
ఎముడాల రాజన్న కొంటెతనమో
సమ్మక్క తల్లి మొక్కు తీరలేదో
ఏం తొక్కిండో.. ఏవని జిస్టో..
మొక్కులన్ని తీర్చుకుంటరని
ముఖం మీద చెయ్యేసి తుడిచేటోడు
దేవుడులాంటి ఎల సమ్మయ్య
ఇంటి పక్కున్న సాయిబెల్లి తల్లి ఎర్రబూబు
సింతపండు, దొడ్డుప్పు, పసుపు కలిపి
రేగ్గాయ గింజకన్నా చిన్నచిన్న గోలీల్చేసి
ఉఫ్ ఉఫని ఊది ఇచ్చేది
చప్పరించమని ఊదు పొగేసేది
ఎవరి మహత్తు ఏందో కానీ ఏడుపు తగ్గేది
సందడితో ఊరు ఊరంతా
మత్తడిబడ్డ చెరువల్లే పారేది
ఎంగిలి మంగలం లేని
చలివాగు నీళ్ల తరీఖ సాగేది
మస్తాన్ సార్ తబాదలైండని తెలిసి
బడి పిల్లగాళ్ల కండ్లల్లో
నీటి సెలిమలు పొంగేటివి
అప్పుడే మంచిగుండె …
కులం తెల్వని, మతం తెల్వని చిన్నతనం
రోగం, రొస్టు వచ్చిన అర్సుకునే తనం
కలిసిమెలిసి బతికిన పెద్దతనం
హే రామ్..హే అల్లా…హే జీసస్
రోగాన్ని నయంచేసే మందు కావాలి
మనిషిని నిలబెట్టే వెలుగు కావాలి
ఇప్పుడు కొందరు మనుషులు కావాలి
మనుషులు.. మనుషులు కనిపించాలి
అవును మనుషులనే కని పెంచాలి
-పొట్లపల్లి శ్రీనివాసరావు
9849254078