నెత్తురు చెమటగా పారించి ఎదిగి పచ్చగా కంట నిండిన దృశ్యాన్ని రెప్పలా కాపాడి తీసిన పంటను తూరుపుకెత్తి గలగలల్ని తక్కెడ ముందు కుప్పపోసి కన్నంటి రెపరెపల్ని కలగంటుంటే.., పిడుగుపడ్డట్టు..
పగిలిన ఆకాశం
కురిసిన వానధారలు
గుండెల్లో దించిన గునపాలు ఎగజిమ్ముతున్న కన్నీళ్లు
ఎండిన గింజలు కదా..
నానాలనే చూస్తాయి ఆవురావురుమంటూ నీళ్లకు మోరలు జాపుతాయి
తడిసిన గోనె సంచుల నుంచి
పచ్చని చిరునవ్వులతో వెక్కిరిస్తున్నట్లు మొలకలేస్తాయి
అంతే… మండు టెండలు పిండేసిన ఉన్నతులు కదా.. కురిసిన
జడివాన జలనాట్య కేళిలో
మీ మేనులూ పులకరిస్తాయి
ఏరుకున్న వడగండ్లలో
కరిగిపోయిన బాల్యాన్ని
కలలు కంటుంటారు మీరు
ముక్కిపోయిన కలలతో
దుక్కపు కుప్పనై నేను
తలనెత్తి దయావర్షంకై చూస్తే
పైవాళ్లే కాదు
నిన్నటిదాక నిప్పులు చెరిగిన సూరీడు
ముఖం చాటేస్తాడు
అప్పుడుకాని అర్థం కాదు
నిప్పు అంటుకోవలసింది లోపలని
పెట్టే చేతులను చాపటం తప్పని
పిడికిళ్లై లేస్తేగాని
తక్కెడ వంగడమే కాదు
అసలు లెక్కలూ తేలవని
– మడిపల్లి రాజ్‌కుమార్ 99496 99215