ఆకులు జారవిడుసుకొని
ఆకాశం వైపు ఆశగా చూపులు
మోడుకు నీడపట్టిన మొగులు
చల్లని చూపుల చందమామ
వెన్నెల చినుకులు మొదలు
మొండికొమ్మల నోళ్లు తడుపుతయి
కొసకొమ్మల మీద
గుత్తులు గుత్తులై మొలిసిన గుబాళింపులు
మంచుపువ్వులు రాలినట్టు
ఎండుటాకుల పరదాల మీద
పువ్వుల ఎండుగలు రాళ్లవాన పడ్డట్టు
రాలిన సుమాల వాసనను
గాలి గూడానికి వార్త మోసుకొస్తుంది
మబ్బులనే ముక్కుపుటాలకు
కమ్మటి వాసనల విందు
గున్నమావిళ్లు గంపలు పట్టుకొని
చెట్లు, గుట్టలు గాలిస్తయి
రాలి ఎండిన ఆకుల కుప్పల్లో దాగిన
తేళ్లు, పాముల పహారాను తప్పించుకొని
గుడ్డెలుగుల దాడిని గాడి తప్పించి
గుడిసె గుండెను చేరే గంపలు
వేడి కిరణాల చరణాలను కూడగట్టుకొని
పచ్చని గొడుగులైన ఇప్పలు
పరకలన్నీ పండి నెత్తిమీద గంపలై
గుమ్ములు నిండి గానుగై ఆడి
గసి గుండె మీద కాలుపెట్టి అడుగుకు అదిమి
బుడ్లు నిండిన నూనె
కూరకుండల్లో ఘుమఘుమలు
గుడిసె గూటిలో చిగురించే చిరు దీపాలు
పులిసిన పువ్వు సాయారందిగి
సారాయై చలికి దుప్పటి కప్పుతది
కొండంతా అండగా నిలబడే
కోయతూర్ ఊపిరులు ఇప్పలు
-కందుకూరి అంజయ్య
9490222201