సుప్రభాత ప్రభాతంలో
పొగ మంచు దుప్పటి
కప్పుకున్న ఉర్వితలం
నయన మనోహరమై మెరిసింది
పక్షుల కిల కిల రావాలతో
వేకువ జాము మేలుకొలుపు పాట
ప్రభాత నాదమై
ప్రభవించే మోదమై వినిపించింది
పత్ర పరిష్యంగనంలో మైమరిచిన
తుషార బిందువులు
గోరువెచ్చటి పొద్దు పొడుపు కోసం
అందమైన ఉషోదయం
ఎదురుచూపు
పచ్చని పసరికలో
తళుకులీనే మంచు ముత్యాల
సోయగం
కనుల విందుగా విరబూసింది
నిహార హారములు అల్లిన
ఆ దృశ్యాన్ని చూసిన
కళ్ళు విప్పారి
హృదయం పూరేకులా విచ్చుకుంది
మంచు ముత్యాలు వెదజల్లిన
మనసు
పచ్చదనంతో చిగురించి
ఓ కవితా సుమమై విరిసింది
వెండి తెరలను పెనవేసుకున్న
నీలి మేఘం
రష్మిక కిరణాలు సోకి మెరుస్తుంది
బిందువుల సందోహంతో
కనువిందు చేస్తున్న
అవని సౌందర్యం
ప్రకృతి చిత్రకారుడు గీసిన
అందమైన బొమ్మే
అది
ఇలా తలం మీద ఓ భూతల స్వర్గమే
-సునీత నెల్లుట్ల
7989460657