కొన్ని పదాలు పలుకు
రాంచిలక తిన్న జాంపండులోని
తీపిగింజల మెత్తదనం
వుందో లేదో.. వింటాను
రెండు పాదాలతో పదడుగుల దూరం
నడువు
మట్టి రేణువులు సరే, గిలగిలలాడకుండా ఎర్రచీమలెన్ని
తప్పించుకున్నాయో లెక్కిస్తాను
ఈ నేలని మొత్తం
చూపులతో తడిమి చూడు
ఎన్ని పచ్చని వేర్లకు
నీ స్వేదం అంటిందో లేదో
ముట్టి చూస్తాను
ఎన్ని బర్త్ డే లు దాటి వచ్చావో
చెప్పు
కుప్ప పోసిన దినపత్రికల్లో
పతాక శీర్షికవై
మెరిసావో లేదో వెదుకుతాను
అరచేతుల్ని గట్టిగా
రాసి, తెరచి చూపు
మృదువైన కలలు గన్నావో
కర్కశమైన గాథలను సృష్టించావో
విశదపరుస్తాను
నిలువెత్తు దేహానికి
ఏది ఇష్టమో..?
చినుకుల పందిరి కింద తడిసిపోవడమా
ఆకాశం దుప్పటి
ముసురుకొని, కుదురుకోవడమా
గుండె ధ్వనుల్లో గుర్తిస్తాను
అమ్మ గర్భాన
ఉమ్మనీటిలో దోగాడినప్పటి
తడి
నీలో ఇంకా మిగిలివుందో లేదో
తెలిసేది
నీ కళ్లలోకి గుచ్చి, గుచ్చి
చూసినప్పుడే!
అన్నం వుడికిందా లేదా
తెలుసుకొన్నట్లే
మనిషిని కూడా…
దాసరాజు రామారావు
96182 24503