శిల్పవతంసులారా! తమచే తెలగాణము దివ్య చేతనా
కల్పితమూర్తిమత్వమును గౌరవ మొప్పగ స్వీకరించి, సం
కల్పము పూర్తి చేసికొనగలెగను; యాదగిరీంద్రు సన్నిధిన్
నిల్పుదుమయ్య డెందములు నిత్యము భక్తిదలర్పనెంతయున్!
ఎంత తపస్సుచేసి తమరీ ధరతోర్వి జనించినారలో
అంతటి శక్తి మీకెటుల అబ్బెనో? యాదగిరిన్ విశేషరూ
పాంతరమందు నిల్పితిరి; అద్భుత శిల్పకళా వతంసులై
చింతలు మాకు దీరినవి శ్రీ నరసింహుని జూచినంతనే!
భారత భూమితోడ ననుబంధముగల్గిన శిల్పశేఖరుల్
గౌరవ మొప్పగా వివిధ ఖండములంజనుదెంచి, భక్తి మొ
ప్పారగ శిల్పఖండముల నంచిత మౌగతి చెక్కియుండగా
వారసులై వెలింగితిరి బాయ యాదగిరీంద్రు సన్నిధిన్!
ఒక్క తెలుంగునాట నివియుండవటంచు వచింపనేల? మే
మెక్కడ దేశమందు తిలకించనిమూర్తుల నిట్టిచోటనే
చక్కగ జూచినారము; ప్రజల్ నరసింహుని దర్శనార్థమై
యిక్కడగేగు దెంచిన వహించెడి భారము స్వామిదే కదా!
ఒక్కొక రాయి జీవకళలుంచుచు చెక్కినవారుమీరు; మీ
రిక్కడ చూపు నైపుణికి యెంతగ ముగ్ధులమౌదుమో కదా!
మ్రొక్కదుమయ్య మిమ్ములనెముందుగ; పిమ్మట దేవ దేవునిన్
చక్కగ సన్నుతించెదము; చాల దెయిద్దికళాభివ్యక్తికిన్!
ప్రభువగునార సింహుడు విరాజితుడై యిట భక్తి కోటికిన్
శుభములోసంగునంచు కడుశోధన జేసెనొ యేమొగాని, మా
ప్రభుతయెమిమ్ముగోరెను ప్రపంచము మెచ్చెడి రీతి సంతత
ప్రభోదజల్ల యాదగిరి; భక్తికి, ముక్తికి ఆలవాలమై..!