ఒక కొత్తజీవికి జన్మను ఇస్తూ ఒక స్త్రీ అమ్మ అవుతుంది. అమ్మ అవడం అనేది ఒక్క స్త్రీ మాత్రమే పొందగలిగే అసదృశమైన వరం. అమ్మ అవడం వరం. అమ్మ అవనికి వరం. ఆప్యాయతకు, అనురాగానికి అమ్మ అత్యుదాత్తమైన అభివ్యక్తి. అమ్మే బిడ్డకు జీవశక్తి. ప్రతిమనిషికీ, ప్రతిజీవికీ అమ్మ ఉంటుంది; ఆ అమ్మ తనబిడ్డకు అంకితమై ఉంటుంది. అదే విధంగా ప్రతిమనిషీ అమ్మకు అంకితం అవ్వాలి. అమ్మ జన్మకు ఆది; అంతేనా? ప్రతిమనిషి, ప్రతిజీవి ఆనందానికి ఆది కూడా అమ్మే!
అమ్మల వల్ల వచ్చాం మనం. అమ్మల కోసం బతుకుదాం మనం. రండి, అందరమూ ప్రకటి ద్దాం.‘పంచభూతాల కన్నా అమ్మ గొప్పది’ అని. అమ్మ అమ్మ కాకపోయి ఉంటే మనకు ఆ పంచభూతాలు తెలిసేవి కావు. అమ్మ మనకు మూలం అని మననం చేసుకుంటూ మనం మనుషులుగా మసలుకుందాం.
బ్రహ్మసూత్రాలలో బ్రహ్మాన్ని కూడా అమ్మ అనే చెబుతూ ‘అత్తా చరాచర గ్రహణాత్’ అని అన్నారు. చరాచరాలను గ్రహించడం వల్ల బ్రహ్మం అమ్మ అని అర్థం. ‘మాతృత్వం భక్తికి మరో పేరు’ అని ఓషో గొప్ప గా అన్నారు. నిజానికి భక్తి కన్నా మాతృత్వం గొప్పదేమో? మాతృ త్వాన్ని పొందగలిగే మహిళ, మహిళ పొంద గలిగే మాతృత్వం అద్భుతమై నవి ఆపై మహోన్నతమైనవి.
‘కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి’ అని ఆది శంకరాచార్య ఒక సార్వకాలిక సత్యాన్ని సర్వోత్కృష్టంగా తెలియజేశారు. చెడ్డకొడుకు పుడతాడు కానీ చెడ్డతల్లి ఉండ దు అని ఆ మాటలకు అర్థం. ఏ మహిళ అయినా తల్లిగా చెడ్డ ది అవడం ఉండదు. ఏదైనా వికృతంగా ఉండచ్చు. అమ్మ తనం వికృతంగా ఉండదు. ఎందులో అయినా దోషం ఉండ చ్చు. అమ్మతనంలో దోషం ఉండదు. బిడ్డను కన్న ఒక మహి ళ సుమాత. ఇది సార్వత్రికం.
ఒక అమ్మ నిస్వార్థమైన శ్రద్ధ ను, ప్రేమను తన బిడ్డపై జీవితాంత మూ కురిపిస్తూనే ఉంటుంది. మహిళకు ఉండే శ్రద్ధ, ప్రేమ మనకు నిత్యమూ ప్రేరణ కావాలి. ఆపై అవి మనకు అనుష్ఠానం కావాలి. మహిళ మా తృత్వశక్తి మనలో తొణికసలాడుతూ ఉండాలి. అప్పుడే మ నం మన దైనందిన ఉనికికి ఉన్నతమైన జన్మను ఇవ్వగలం. ‘దేవుడు నీ ఆత్మకు మాత్రమే బాధ్యత వహిస్తాడు కానీ అమ్మ నీ ఆత్మకూ, శరీరానికీ బాధ్యత వహిస్తుంది’ అని తమిళ కవి కణ్ణదాసన్ ఎంతో సమంజసంగా అమ్మ వైశిష్ట్యా న్ని విపులీకరించారు. భార్య గొప్పతనాన్ని వివరిస్తూ కవి కాళిదాసు శకుంతల పాత్రతో దుఃఖసమయాల్లో తల్లిలాగా… అని పలికిస్తాడు.
మాతృహృదయం కావాలి అని స్వామి వివేకా నంద ఒక గొప్పమాట చెప్పారు. ఆ మాట ప్రకారం మన హృదయాలు పూర్తిగా మాతృత్వమయం అయిపోవాలి. మాతృత్వం మన జీవనానికి ప్రేరణ కావాలి. అమ్మను అలక్ష్యం చెయ్యడం, ఆదరించకపోవడం అమానుషత్వం. జన్మించినందుకు జన్మను ఇచ్చిన అమ్మను అభిమానిస్తూ, ఆదరించాలి. మానవ జాతి సంపూర్ణత్వాన్ని సంతరించుకో వాలి, మానవ జాతి సార్థకతను సాధించాలి. అమ్మలను అనవరతమూ ఆరాధిద్దాం.
(నేడు మాతృదినోత్సవం)
రోచిష్మాన్ 9444012279