హాస్టల్ ప్లేట్లో అమ్మ ప్రతిమ
ప్రతి పూటా కనబడుతుండేది
బతిమిలాడి తినిపించిన
రోజులు గుర్తొచ్చి
గుక్కపెట్టి గ్లాస్ నిండా
దుఃఖం నింపుకొని
తాగేసి పడుకున్న రోజులెన్నో…
అమెరికాలో వాలి పడ్డాక
ఓవెన్ కూడు తిని తిని
కడుపు పేగులు మాడి పోయి
ఆశలు గీశలు సర్దేసుకుని
అమ్మ దగ్గరికి పారిపోదాం అనిపించేది…
లాక్డౌన్ ప్రకటించాక
ఆన్లైన్ ఆహారం బంద్
అహంభావానికి పోయి
ఒక్క వంట నేర్చుకోలేదు
అమ్మ యూనివర్సిటీలో
అన్నీ ఉచిత కర్రీ కోర్సులే ఉండేవి…
సెలవు లేకుండా
విసుగు ప్రదర్శించకుండా
మూడు పూటలు ముప్పై రోజులు
నిరంతర ప్రేమ అమ్మది
మరి అమ్మకు
ఒక్క పూట అయినా
వంట చేసి పెట్టలేదు మేము…
ఇప్పుడు మాత్రం
అమ్మ ఫొటో ముందు
తీరొక్క రుచుల ప్రదర్శన…
దాసరి మోహన్
99853 09080