ప్రతిష్టాత్మకమైన ఫీచర సునీత రావు 2026 పురస్కారాలను ఫీచర సునీతా రావు ఫౌండేషన్ చైర్మన్ ఫీచర విజయేందర్‌రావు ప్రకటించారు. కవితా విభాగంలో బాణాల శ్రీనివాసరావు (రాత్రి సింఫనీ), కథా విభాగంలో జి.ఉమామహేశ్వర్ రావు (అహానికావల), స్వర్ణ కిలారి (గోడవతల) విమర్శలో (తెలంగాణ కవి ముద్ర) బండారి రాజకుమార్, (తొలితరం కథకుల కథనరీతులు) కేపీ అశోక్‌కుమార్ ఎంపికయ్యారు. ఈనెల 24వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే ఒక కార్యక్రమంలో విజేతలకు ప్రముఖ సాహితీవేత్తల చేతుల మీదుగా రూ.15 వేల పురస్కారం, సత్కారం జరుగుతుందని తెలిపారు.
జీవజలం చలం సాహిత్య స్మారకోపన్యాస సభ
జీవజలం చలం సాహిత్య స్మారకోపన్యాస సభ ఈనెల 19వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతుందని చలం భావన కన్వీనర్ డాక్టర్ నాళేశ్వరం శంకరం ఒక ప్రకటనలో తెలిపారు. చలం పౌరాణిక సాహిత్యం-వస్తు రూపాలపై ఎన్.వేణుగోపాల్, కుప్పిలి పద్మ ప్రసంగిస్తారని తెలిపారు.
తుడుం కవితా సంకలనం కవితలకు ఆహ్వానం
అడవిలో ప్రతి చెట్టు ఒక కథ చెబుతుంది..ప్రతి రాయి ఒక పాఠం చెబుతుంది. అందుకే..ప్రకృతితో ఏకమై జీవించే ఆదివాసీ జీవన విధానాన్ని కవితల రూపంలో ప్రచురించాలని ముందుకు వచ్చింది బోలి చేతో సంస్థ. ఆసక్తి గలవారు ఆదివాసీ జీవన విధానాన్ని తెలిపే కవితలను తెలుగు భాషలోనే రాయాలని, రాత రూపంలో గానీ, టెక్స్ రూపంలో గానీ పంపాలని నిర్వాహకులు సూచించారు. కవితలు పంపాల్సిన చివరి తేదీ: మే 20. మెయిల్: thudum kavitha sankalanam @gmail.com లేదా సిడాం వరప్రసాద్, వాట్సప్: 6301687211కు పంపాలని తెలిపారు.
19న ‘మట్టి గీతం‘ దీర్ఘ కవిత పుస్తకావిష్కరణ
ప్రముఖ కవయిత్రి, తెలంగాణ బతుకమ్మ పాటలపై తొలి పరిశోధకురాలు, తెలుగు పాఠ్యపుస్తక రచయిత్రి డాక్టర్ బండారు సుజాత శేఖర్ రాసిన ‘మట్టి గీతం‘ దీర్ఘ కవిత పుస్తకావిష్కరణ ఈ నెల 19న నార్త్ గోవాలో జరుగుతుంది. ఏకే మీడియా, ఎఫ్టీఏఎమ్, ముంబై భారతి సంయుక్త నిర్వహణలో డాక్టర్ అంబల్ల జనార్దన్ దీనిని ఆవిష్కరించనున్నారు.