నా నుంచి ఏ దృశ్యమూ
నన్ను గాయపరచకుండా పోలేదు
ఈ విశాల ప్రపంచం అడుగులకు
పొద్దుమాపులను మోపు చేసినప్పటినుంచీ
నేనొక అనిర్వచ వాక్యమవుతూనే ఉన్నాను!
ఇక్కడేమో చలినెగళ్ళ ప్రస్తావన
అక్కడేమో జ్వలన నాదాలు!
మనదైన బుద్ధి చాపల్యమో
తమదైన సత్తువ లేనితనమో
అన్నీ మరుపు తట్టకెక్కిస్తుంటాము
ఒకానొక సూరీడు
ఉత్తర విహారమొక్కటి చేయమంటున్నాడు
దేశ, మధ్యభాగమే
మన దేహ హృదయ భాగమయ్యుంటే
కిరణ తాపడాల
భావయుద్ధాలు జరుపుతున్నట్టు
సముద్రం సంకేత పవనాలను
పంపుతున్నట్టు
అదిమిపట్టిన దుఃఖం
నా కళ్ళముందు కడలి ఉప్పొంగుతూనే ఉన్నది!
ఏదీ నాదికాకుండా పోనన్నప్పుడు
ఆక్రమిత దృశ్యాల ముందు
సమయాన్ని తిట్టి పోస్తూ
వానాకాలపు ఎండ నుంచో
ఆషాఢపు మేఘం నుంచో
అంతఃప్రేరణ పొందని
మనస్సు స్పందన తెలుపని
వింత జనంలో
శరీరాన్ని వేలాడదీస్తూ
నలుగురిలో నడవటం నేర్చినం
నయం అనుకుంటూ…
మర బొమ్మలమవుతున్నం!
నీవు నాకోసం ఏమీ చేయకున్నా
సముద్రమంత కవిత్వమైన
అక్షరయోధుని వివరం చెబితే చాలు..!
ఓ పసిఫిక్ మహాసంద్రమా!
చాలీచాలని బతుకుగోడు చెప్పిన
అగ్నికీల కనులకు కనిపిస్తే చాలు
నేనో మెరుపునైపోతాను
ఎన్ని పాదాలుగా విస్తరించి కవిత్వమై
కవి హృదయమై విస్తరించావు!
మాటల మాటున దాగక
నాకొక్క ‘వర’ వరాల
మూటనిస్తావా రత్నాకరా..!
కన్నుల మాట వదిలేయిగానీ
నా కాళ్ళను తడుపుతున్నావు ఇక్కడ
అక్కడ పద్యాల్లో బంధీవైన నిన్ను
కొత్తగా పరిచయం చేయించుకున్నావు
బడబాగ్నుల నిలయం నీవని
రెప్పలకు వేళ్లాడేసిన చుక్కలను
మనసు దొప్పలతో తాగుతున్నాం…
నిశ్శబ్దమెరుగని మా గుండెల చప్పుళ్ళు
ఎప్పుడూ ఓటమెరుగని
బతుకుసవ్వళ్లనే వినిపిస్తున్నది
ఆగని కెరటాల్లా
ఆలోచనల్ని మోస్తూ వస్తుంటే
జయ తరంగాల హోరులో భావోత్తుంగమై
‘సముద్రం’ ఇప్పుడు ప్రత్యక్ష దర్శనంలో
చిన్నగా ఓ అనుభూతి వాక్యాన్ని
బహుమతిగా ఇచ్చింది..!
కొండపల్లి నీహారిణి