వెన్నెల కల మన జీవన కల
మన అస్తిత్వ కల ఇదే మన నేల కల
ఇది జాతి స్వభావాల కల
సాంస్కృతిక సమర కల
అమరుల అమరత్వపు కల
ఇదే మన సంఘటిత కల
ఇంకా యింకా
మనలోపలి శత్రువు బయట శత్రువుతో
పాచికలాడటం మాని
వియ్యమందుకునే పనిలోనే ఉన్నాడు.
కులం మతం ధనం ముగ్గురు వేరు వేరు కాదు
ఒకే నొక్క విశ్వరూపమెత్తి ఆధిపత్య క్రీడలో ఉన్నాడు
మన వెన్నెల కలల మీద
ఎన్నెన్ని వలలు విసిరారన్నది కాదిప్పుడు
అదిప్పుడు మనల్ని బోనులోపెట్టి
ఇనుపచీపురు కట్టలో మన
అనుబంధాల్ని కాజేసే విద్యలో ఉంది
మనమొక సాయుధ జలంతో
కలిసి పోరాడితే సరిపోదు.
సాయుధ రైతాంగ పోరాటపు నిప్పుకణికల్ని
అభినవ గీతోపదేశం చేసే సందర్భంలో ఉన్నాం
వెన్నెల కల మాయం కాకూడదు.
మాయావుల మాయలో బందీ కాకూడదు.
మనది శ్రమైక జీవనం కదా!
బాల్యాన్ని కడదాకా దాచుకునే జాతి కదా!
మన అమాయకత్వం
విశ్వ వీణను పులకింప చేయగలదు.
మన వెన్నెల కల నడుస్తున్న చరిత్రకు
సృజన రూపాన్నిచ్చే కల
కవులెప్పుడూ పాలపిట్టల పక్కనే
మంటల్లో దహనమైన మన అస్తిత్వ దుఃఖం
పాల పిట్టల హృదయాల్లో చెక్కు చెదరలేదింకా!
మన నేల ఎడారి కాదు.
మనఊరి పోశవ్వ
సేద్యభూమిలో కలుపు తీస్తున్న దృశ్యం.
కళ్ళముందు కదులుతూనే ఉంది !
ఒకటి కాదు రెండు కాదు
గందరగోళం వెంట గందర గోళాలెన్ని వచ్చినా
చెరువులో చాకలి బట్టలుతికి నట్టు.
ఉతకబట్టే కదా ఈ మల్లెపూబట్టల సంబురాలు
పుల్లలు పెట్టే వాళ్ళు వెంకిరించేవాళ్ళు
మన వెన్నెముకల్లో చేరి
లతుకోరాటలు ఆడిస్తూనే ఉంటారు.
దేన్ని పసిగట్టాలన్నా జల్లెడ పట్టే గుణాన్ని వదలరాదు
ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు ఇంటింటా ఉన్నారు.
ప్రజాపోరాటాల ధనుర్విద్యలో జీవించక పోతే .
మన సామాజిక బతుకు
సగం నిండిన నీళ్లబిందే అవుతుంది
ఎవరేమన్నా వెన్నెల కల జన జీవన కల
ఆత్మరక్షణ కల సంరక్షించుకునే కల
వెన్నెల కల వెన్నెలదే కాదు మనందరిది కూడ.
-డాక్టర్ నాళేశ్వరం శంకరం
94404 51960