సాహిత్యం ఎందుకు చదవాలో స్పష్టంగా దాని నిర్వచనమే చెప్తుంది. సహితస్య భావః సాహిత్యమ్, అంటే హితంతో కూడినది, హితాన్ని చేకూర్చేది సాహిత్యం. సాహిత్యం చదివిన వారు మానవునిలో మాధవుణ్ణి చూడగలగాలి. ఏది హితం, ఎవరికి హితం అని ఆలోచిస్తే సమాజానికి హితం చేకూర్చేదే సాహిత్యం అనుకోవాలి. ఇదే మరో రకంగా ‘విశ్వశ్రేయః కావ్యమ్’ అనాలి.
మహాభారతం చదివితే మనిషి జీవన ప్రస్థానానికి సోపానాలు కనిపిస్తాయి. అలా మెట్టు మెట్టు ఎక్కడం తెలియాలి. సత్యం చాలా గొప్పది సత్యమేవ జయతే.
‘నుతజలపూరితంబులగు
నూతులు నూరిటికంటె సూనృత
వ్రత యొక బావిమేలు మరి
బావులు నూరిటికంటె నొక్క స
త్క్రతువది మేలు తత్క్రతుశతంబునకంటె
సుతుండు మేలు త
త్సుత శతకంబుకంటె నొక
సూనృతవాక్యముమేలు చూడగన్’
అంటే భారతంలో ఈ పద్యం చదువుకున్న వాళ్ళకి, అసత్యం చెప్పాల్సి వస్తే ఈ పద్యం తప్పక గుర్తుకు రావాలి.
అలాగే వ్యాసుడు కాశీ మీద అలిగాడు. అలాగే కాశీని శపించ సిద్ధమయ్యాడు. రోజూ కాశీ పట్టణంలో భిక్ష దొరికేది, ఒకనాడు లభించనంత మాత్రాన శపించడం తగునా? భారతాన్ని లోకానికి అం దించిన వ్యాసుడు, అష్టాదశ పురాణాలు అందించిన వ్యాసుడు, ఇలా శపించడం అహంకారం కదా? అని యువత తర్కించుకుంటే, అహంకరించటం తగదు అని భావిస్తే సాహిత్య ప్రయోజనం చేకూరినట్లే కదా!
సాహిత్యంలో గుణనిధి, నిగమ శర్మ పాత్రలు చదివిన యువత ఎలా ఉండకూడదో ఆ పాత్రలే స్పష్టంగా చెబుతాయి. సాహిత్యానికి ప్రాచీన ఆధునికత అని భాగాలు అవసరం లేదని భావిస్తాను. సంస్కర్తల యుగంలో సమాజంలో కొత్త మార్పులు సాహిత్యం ద్వారా వెలుగు చూశాయి. స్త్రీని ఒక వ్యక్తిగా గుర్తించడం, జరుగుతున్న
అన్యాయాలని గొంతెత్తి చాటడం జరిగింది. బాల్య వివాహాలు నశించాలని, స్త్రీకి విద్య అవసరమని చాటి చెప్పింది సాహిత్యం. గురజాడ వారి ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ ఎంతమంది తల్లిదండ్రుల ఆలోచనలు మార్చిందో, సాంఘిక దురాచారాలను తరిమి కొట్టాలని ప్రచారం జరిగిందో తలచుకుంటే కందుకూరి, గురజాడ లాంటి వారికి స్త్రీలందరూ శిరస్సు వంచి నమస్కరించాల్సిందే.
‘ఆధునిక మహిళలు భారతదేశ చరిత్ర తిరిగి లిఖిస్తారు’ అన్న గురజాడ ఆశాభావం అక్షర సత్యం అయింది. అభ్యుదయ గామి శ్రీశ్రీ సాహి త్యం యువతను మేలుకొలుపుతుంది. సాహి త్యం ఎందుకు చదవాలో తన గొంతులో నుంచి అద్భుతంగా చెప్పాడు. కదిలేది, కదిలించేది, మారేది, మార్పించేది, పాడేది, పాడించేది, పెను నిద్దుర వదిలించేది, మునుముందు కు సాగించేది, పరిపూర్ణపు బతుకిచ్చేది ఇదే సాహి త్యం నేటి యువతరానికి అందించి పరిపూర్ణపు బతుకునివ్వగలగాలి. సమాజంలో రకరకాల ఉద్యమాలు ప్రజల్ని ఉద్రేకపరిస్తే బాసటగా నిలిచింది సాహిత్యమే.
‘గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనబోను, భవిష్యత్తు వదులుకోను, కాలం నా కంఠమాల’ అని నినదించిన మహాకవి దాశరథి. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, గురువర్యులు డాక్టర్ సి. నారాయణరెడ్డి ‘నా వచ నం బహువచనం, నా వాదం సామ్యవాదం, కవి త్వం నా మాతృభాష, ఇతివృత్తం మానవత్వం’ మానవత్వమే సాహిత్య ప్రయోజనం కదా.
సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయిత్రులు ఎందరో సాహిత్య ప్రయోజనాన్ని చాటిచెప్పారు. కనుపర్తి వరలక్ష్మమ్మ ‘శారద లేఖలు’, లక్ష్మీకాంతమ్మ ‘మహా సాహితీ’ ‘మన భారతి కవితలు’, ఇల్లందల సరస్వతిదేవి ‘నీ బాంచను కాల్మొక్త’ నవల, రంగనాయకమ్మ
‘బలిపీఠం’ నవల, స్త్రీవాద రచయిత్రి ఓల్గా ‘స్వేచ్ఛ’ నవల, మాలతి చందూర్ ‘హృదయనేత్రి’ – ఇలా మన రచయిత్రులు సమ సమాజ స్థాపనకు, సౌభ్రాతృత్వానికి, మానవీయ విలువలకు పట్టం కట్టారు, సాహిత్యం ద్వారానే సాహిత్య ప్రయోజనం సాధించారని చెప్పాలి.
ఎందుకు సాహిత్యం చదవాలి అంటే, మనిషిని మనీషిగా చూడటానికి, దురాచారాలను రూపుమాపటానికి, సాంఘిక శ్రేయస్సును దర్శించడానికి సాహిత్యం, సహితస్య భావః సాహిత్యమ్ అయింది. యువతరానికి ప్రేమ అనే మాట విలువ తెలియాలంటే సాహిత్యం చదవాలి.
భావకవి కృష్ణశాస్త్రి అంటారు.
‘సౌరభము లేల చిమ్ము పుష్ప వ్రజంబు
చంద్రికల నేల వెదజల్లు చందమామ
ఏల సలిలంబు పారు
గాడ్పేల విసురు
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను’
– అంటే ఏమీ ఆశించకుండా, నిర్మలంగా, స్వచ్ఛంగా ఉండేదే ప్రేమ – ఇది చదివి అర్థం చేసుకున్న యువత ప్రేమించనంటే పెట్రోల్ పోసి కాలుస్తాడా? కట్నం తేలేదని భార్యకు విడాకులు ఇస్తాడా? అంటే, ప్రేమ నిస్వార్థమైనదని సాహిత్యం చదువుకున్న విద్యార్థి మనసు వికసించాలి.
‘మతమన్నది నా కంటికి మసకైతే
మతం వద్దు గితం వద్దు మారణహోమం వద్దు’
– అన్న కవి మాట అర్థం చేసుకుంటే మతకలహాలు ఉంటాయా?
సాహిత్యం విశ్వశ్రేయస్సును అందించాలి. సాహిత్యం ఎందుకు చదువుకోవాలంటే మానవత్వం వెలుగొందడానికి సహితస్య భావః సాహిత్యమ్.
డాక్టర్
ముక్తేవి భారతి ,99896 40324