మనం యాగం చేద్దాం
ఆధునిక జనమజ్జేయులమై
సర్పయాగం చేద్దాం
చీమల్ని నాకే చిన్నపాములు
జంతువుల్ని మింగే కొండచిలువలు
నీరెండలో చర్చలు చేస్తున్నవి
అపవిత్ర కలయికతో
వికృతరూపాల్ని కంటున్నవి
ఆకర్షక బుట్టలమర్చి
నిలువునా చుట్టుకుంటాయి
వేట వలల్ని విసరడంలో
నక్కజిత్తులను మించినవి
పడగతో నీడబట్టి
తోకతో పాదాలు లాగుతాయి
బుసకొట్టి విషం చిమ్మడానికి
భుజంపై చెయ్యేసి తిరుగుతవి
ఇపుడా సర్పాలు కుబుసం విడిచి
కొత్త బలం పొందడానికి
విషాన్ని అమృతంగా మారుస్తా నంటున్నాయి
పడగ ముడిచి పాకుతానంటున్నాయి
పదవి పాశుపతాస్ర్తాల్ని
ప్రసన్నం చేసుకోవడానికి
మణులను ఎరవేస్తున్నాయి
-దామరకుంట శంకరయ్య
94408 76788