నన్నెక్కడైనా చూశావా?
వీధి మొదట మలుపులోనో
నీ జ్ఞాపకాల నీడలలోనో!
శిశిరంలో నీ కాళ్ళ కింద చిట్లుతున్న
ఆకుల ఆక్రందనలోనో
వెన్నెల రాత్రుల్లోనో
నీ చేతిపై నీ కోసం రాలిన కన్నీటి బొట్ల
వెచ్చని స్పర్శలోనో
ఏవైనా స్మృతులు కలిశాయా ఎపుడైనా
నువ్వు నిద్రిస్తున్న తరుణాన
నీ ముంగురులతో
గాలి గుసగుసలాడినప్పుడు
ఏవైనా మాటలు గుర్తొచ్చాయా
చెరువు గట్టుపై
నువ్వు నడిచి వెళుతున్నప్పుడు
నీ అడుగుల చప్పుడైనా
ఏదైనా తలపునకు తెచ్చిందా
మావి తోటలో
ఆకుల గుబురులోంచి
కోయిల కమ్మని స్వరం వింటున్నప్పుడో
అసలేవీ నీకు గుర్తుకుతేవడం లేదా
ఏవీ గుర్తుకురావడం లేదా
సరేలే.. జ్ఞాపకాలు ఏపాటివి ?
సుడిగాలి తాకిడికి
ఇసుక దిబ్బలు చెదిరిపోవడం లేదా
అలల తాకిడికి
తీరాన రాసుకున్న పేర్లు
నిలిచి ఉంటున్నాయా ?
అంతేలే
జ్ఞాపకాలు ఏపాటివి ?
కాలం కరిగించివేస్తుంది
కన్నీటినీ, గాయాలనూ
కాలం తుడిచివేస్తుంది
అన్ని జ్ఞాపకాలనూ!!
దండమూడి శ్రీచరణ్: 98661 88266