పల్లవి:నవ్య తెలంగాణ- నా దివ్య తెలంగాణ
సంక్షేమమే- సౌభాగ్య ఝరులున్న వీణ!
చరణం: పల్లె సీమన రైతు ప్రగతి రథమెక్కంగ
నేలమ్మ ప్రతి అడుగు సిరుల గొడుగెత్తంగ
చెరువులూ కుంటలూ మత్తడులు దూకంగ
ప్రాణమే తిరిగొచ్చి చేలన్ని పండంగ
ధనధాన్యరాశి తెలంగాణ.. సంపదకు వాసి! ॥నవ్య॥
చరణం: బహుళ ప్రాజెక్టులు మనకష్టములు తీర్చె
కోట్ల ఎకరాలను మాగాణముగ మార్చె
ఉచిత విద్యుత్తుతో సాగు ఉరకలు వేసె
కాటేయు కరువులను దీటుగా ఏమార్చె
ఇది కీర్తిసొగసు తెలంగాణ.. నది నీటి మనసు! ॥నవ్య॥
చరణం: పెట్టుబడి చేయూత పెన్నిధిగ సాకంగ
రుణమాఫీ, బీమాలు ధీమాను పెంచంగ
చేతినిండా పనుల కులవృత్తులలరంగ
బడుగు బలహీనులు బాధలను మరువంగ
సందేశ ధాత్రి తెలంగాణ… సమభావన మూర్తి! ॥నవ్య॥
చరణం: హరితవనములు నిండి ఆయుష్షు నీయంగ
ఆరోగ్య జీవనము ప్రతి గడప కబ్బంగ
పర్యావరణమెంతో ప్రఖ్యాతి గాంచగా
అన్ని కాలాలిచట హాయి గొల్పగ సాగె
సర్వాంగ వృద్ధి తెలంగాణ… చైతన్య దీప్తి! ॥నవ్య॥
చరణం: ఉద్యమాలుగ ఉరిమి అణచివేతల నెదిరి
ఎలుగెత్తి పోరాడి నినదించి నిలిచింది
దార్శనిక పాలనకు నెలవు తానయ్యింది
ఎనిమిదేండ్లలొ తాను అగ్రగామయ్యింది
దశ దిశల కీర్తి తెలంగాణ… ఈ దేశ స్ఫూర్తి! ॥నవ్య॥
-మడుపతి జగదీశ్వర్, 94948 17919