మధురిమలు వినిపించిన
వెదురుగడలు కూడా
బెదిరిపోయేలా
సుదూరంగా
నిశాగానం వినిపిస్తున్నది
ఒక్కసారిగా
నిద్ర రంగు
కళ్ళల్లో దుమారం లేపుతుంది
రెటీనా రెక్కలు
కనుపాపల కిటికీలను
గట్టిగా పట్టుకుంటాయి
కలల ధూళితో
కలవరపడ్డ అంతర్నేత్రంపై
మగత
పొరలు పొరలుగా
కమ్ముకుంటుంది
గతం.. తెరలు తెరలుగా
దొర్లుకుంటూ పోతుంది
అప్పుడది.. సూటిగా చూస్తూ
రెండు నీటిబొట్లు
రాల్చి మూసుకుపోతుంది
ఇక.. మళ్లీ తెరుచుకోదు
ఆ నిశాగానం
మరో దిశకు వెళుతుంది..!
కుడికాల వంశీధర్
9885201600