ఎలాంటి సందేశాలు, ఉపదేశాలు లేకుండా కథను రాసి మెప్పించగల రచయితలు అరుదుగా కనిపిస్తారు. ఆర్భాటపు సందేశాలతో కథను ముగించడం కంటే ఉద్విగ్నత, సంక్షుభిత్వాన్ని రచనలో కొనసాగిస్తూ సాఫీగా కథను నడపటం కొంతమందికే చెల్లుతుంది. అలాంటి రచయితల జాబితాలో ముందుంటాడు రష్యా రచయిత ‘చెహోవ్’. జీవితంలోని అసంతృప్తులను చర్చకు పెట్టి జీవితం ఎలా ఉండాలో పాఠకుడే నిర్ణయించుకునే అవకాశాన్నిచ్చి పాఠకున్ని కథలో భాగం చేయడం చెహోవ్కు మాత్రమే తెలిసిన అరుదైన విద్య.
ప్రపంచ చరిత్రలో రష్యా విప్లవం గొప్ప ఘటన. అక్టోబర్ విప్లవంగా పేరొందిన ఈ చారిత్రక పోరాటాన్ని ప్రతిబింబించే సాహిత్యం రష్యా రచయితల నుంచి చాలా వచ్చింది. అక్టోబర్ విప్లవ పూర్వ రష్యన్ జీవితానికి, కాలానికి అద్దం పట్టినవాడు అంటోన్ పావ్లోవిచ్ చెహోవ్. కథకుడిగా, నాటక రచయితగా, వైద్యుడిగా అతడి బహుముఖ ప్రజ్ఞ ప్రపంచ గొప్ప రచయితల్లో ఒకడిగా నిలిపింది.
19వ శతాబ్దం రష్యాకు అత్యంత ప్రసిద్ధకాలం. ఆ కాలాన్ని సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తుల్లో చెహోవ్ ఒకరు. లియో టాల్‌స్టాయ్, తుర్గనేవ్, దోస్తోవ్ స్కీ, పాస్టర్నాక్ తదితరులు ఆ కాలాన్ని సొంతం చేసుకున్నవాళ్లలో ప్రముఖంగా కనిపిస్తారు. రష్యా విప్లవానికి పూర్వం జార్ చక్రవర్తుల పాలన పూర్తిగా హేతుబద్ధ వ్యతిరేక పాలన. సృజనాత్మకతకు, సత్యానికి స్థానం తక్కువ. ఈ పరిస్థితులపై వ్యతిరేకత చెహోవ్ కథల నిండా కనిపిస్తుంది. అధికారుల పట్ల ఆయన ప్రదర్శించిన వ్యంగ్యం, అధికారుల్లోని సంకుచిత మనస్తత్వం, బలహీనుల అణకువతనం మనకు కనిపిస్తాయి.
‘ఎ డెత్ ఆఫ్ క్లర్క్’ వంటి కథల్లో నిజాలను వ్యంగ్యంగా చెప్పడమనే ప్రక్రియ కనిపిస్తుంది. ఏ మాత్రం హేతువాద లక్షణాలు కనిపించినా హింసించే ప్రగతి వ్యతిరేక పాలనలో ఆ పరిస్థితులను వ్యతిరేకిస్తూ రచనలు చేశాడు చెహోవ్.
ఆ సమయంలో ఆయన అనేక ప్రాంతాలు తిరిగాడు. జపాన్‌లోని సఖాలిన్ ద్వీప ప్రాంతం లో బందీలుగా ఉన్న ఖైదీలను కలుసుకొని వాళ్ల జీవితాలను అధ్యయనం చేశాడు. ‘హత్య’ లాంటి రచనలు ఆ కాలంలో వచ్చినవే. మానవత, రాజకీయకోణంలో వచ్చిన ఈ రచన ఎం తోమందిని ఆయనకు అభిమానులను చేసింది. ‘ఇయోనిచ్’ కూడా ఈ కోవలోనిదే. ఉపేక్షకూ హృదయ రాహిత్యానికీ లోబడిన మనిషి కథ ఇది. మనిషి దైన్యాన్నీ, నైరాశ్యాన్నీ, కరుణ రసభరితమైన సందర్భాలను ఆయన కొన్ని రచనల్లో బలంగా చిత్రీకరించాడు.‘ది బ్లాక్ మాంక్’, ‘ది బటర్ ఫ్లై’ లాంటి రచనల్లో మనం ఇవి చూస్తాం.
చెహోవ్ సృష్టించిన నాటకాల్లో ‘ది చెర్రీ ఆర్చర్డ్’, ‘త్రీ సిస్టర్స్’, ‘అంకుల్ వన్య’ లాంటి నాటకాలు వేలసార్లు ప్రదర్శించారు. నాటి రష్యా దుస్థితిని విమర్శించేందుకు చెహోవ్కు నాటకం ఆయుధంగా ఉపయోగపడింది.
మనుషుల్లోని సవాళ్లను ప్రతిబింబించే పాత్రలను సృష్టించడం చెహోవ్కు ఇష్టం. అన్నా ఆన్ ది నెక్, ఐయోనిచ్ పాత్రలు ఇలా సృష్టించినవే. ఈ పాత్రలను ఇమేజనరీ ద్వారా, సింబాలిజం ద్వారానూ మనకు వివరించడానికి ప్రయత్నం చేస్తాడు చెహోవ్. విభిన్న సమాజ స్వభావాలను అన్వేషించి ఈ పాత్రలకు ప్రాణం పోయడం ద్వారా శిథిలమవుతున్న సమాజ దృశ్యాలను చిత్రీకరించాడు. తనను తాను విశ్లేషించుకోలేని స్థితి అస్థిరతకు ఎలా కారణమవుతుందో ‘అన్నా’ పాత్ర చెప్తే, సంపద సృష్టించే చెడు ఎలా ఉంటుం దో ‘ఐయోనిచ్’ పాత్ర చెప్తుంది. ఒక ఒప్పందం కోసం, లేదా తల్లిదండ్రుల పరస్పర అంగీకారం, ప్రేమర హిత వివాహాలు, భాగస్వాముల మధ్య ఎలా ప్రేమ రాహిత్యానికి దారి తీస్తుందో ‘ది లేడీ విత్ పెట్ డాగ్’ (కుక్కను వెంటబెట్డుకున్న మహిళ) కథలో మనకు అర్థమవుతుంది. రష్యన్ సాహిత్యాన్నే కాకుండా ప్రపంచ సాహిత్యాన్ని సమాజాన్ని ప్రభావితం చేసిన చెహోవ్ ‘స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్’ టెక్నిక్‌లో రచనలు చేశాడు. 1888 కాలంలో అతడు రాసిన ‘ది సెప్పి’ ఒక సంచలనం. 8 అధ్యయనాలతో ఉన్న ఈ పెద్ద కథ స్వీయ విధ్వంస దుఃఖంలో మునిగిపోయిన ‘పాంటేలీ’తో పాటుగా అన్ని పాత్రలను కథలో అద్భుతంగా మలిచాడు. గొప్ప దృశ్య చిత్రాల తో, కవితాత్మకంగా, లిరికల్ సింప్లిసిటీతో పాఠకున్ని గొప్ప అనుభూతిలోకి తీసుకెళ్తాడు.
చెహోవ్ బాల్య జీవితం కష్టాలతో గడిచిం ది. రష్యా ఓడరేవు పట్టణమైన టాగన్ రోగ్‌లో 1860 జనవరి 29న దిగువ, మధ్య తరగతి కుటుంబంలో జన్మించా రు. డాక్టర్‌గా పేదలకు వైద్యాన్ని అందించడంలో ఆయన ఆనందాన్ని పొందేవారు. అత్యంత సృజనశీలతను చాటిన చెహోవ్ 1904 జూలై 15న జర్మనీలోని గ్రాండ్ డచీలో కన్నుమూశారు.
డాక్టర్ చెమన్
94403 85563