ఒకానొక పారంపరిక ఋషి సంప్రదాయాన్ని మనకళ్ళముందు ఆవిష్కరించి నిరంతరం శ్రీమాతృ సేవలో తరించి, అవధూత అయిన తండ్రి గారికి (శ్రీ సాంద్రానంద ఘన స్వరూప నృసింహ స్వామి వారికి) ప్రియతమ అంతేవాసులై, పూర్వజన్మ సంస్కార ఫలమైన ఆర్ష వాఙ్మయాన్ని మంగళగీతాలుగా అపూర్వ స్తోత్ర శ్లోకాలుగా రచించి, అష్టావధాన, ఆశు కవితావిన్యాసాలను అలవోకగా అందించి, ’పద్మపత్ర మివాంభస’ (తామరాకుపై నీటి బొట్టు లాగా) రీతిగా సంసార జీవనాన్ని సాగిస్తూనే పరబ్రహ్మ తత్త్వచింతనతో గడిపారు విద్వద్వరేణ్యులు, పముఖ ఆధ్యాత్మికవేత్త, అష్టావధాని గౌరీభట్ల శ్రీనాథ శర్మ (70) అక్టోబర్ 9వ తేదీ గురువారం మధ్యాహ్నం దివంగతులయ్యారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని మర్రి ముచ్చాల వాస్తవ్యులైన శర్మ గారు ధార్మికవేత్తగా సంస్కృతాంధ్ర భాషా పండితుడుగా, కవిగా సుపరిచితులు. పదవ తరగతి మాత్రమే చదువుకున్న శ్రీనాథ శర్మకు జన్మతః అబ్బిన విజ్ఞానంతో సంస్కృత, ఆంధ్ర భాషలలో ఆశుకవిత్వాన్ని అనర్గళంగా చెప్పగలగడం అలవడింది. చదువుకునే రోజుల్లోనే ఉపాధ్యాయులకు సైతం అర్థం కాని అనేక సంస్కృత శ్లోకాలను అలవోకగా అర్థవంతంగా బోధించేవారని వారి సమకాలికులు గుర్తు చేసుకుంటారు. తాను పర్యటించిన కాశీ, మధుర, వేములవాడ వంటి క్షేత్రాలలో అప్పటికప్పుడు ఆశుధారగా పద్యాలను చెప్పి తమ అవధాన ప్రజ్ఞాపాటవాన్ని ప్రదర్శించేవారు. గట్టిపట్టుదలతో అనేక అష్టావధానాలు చేసి సద్విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆశు కవిత్వంతో పాటు తాను నమ్మిన దైవాన్ని కీర్తిస్తూ అనేక మంగళహారతులు రాశారు. లలితలలిత పదజాలంతో సుప్రసిద్ధ సినీ గేయాల ఫణితిలో వారు రచించిన భక్తిగేయాలన్నీ గానయోగ్యమై అలరారుతున్నాయి. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి సుప్రభాతం, అమ్మవారి స్తుతులు, సాంద్రానంద స్వామి వారి మేలుకొలుపు, జీవన చరిత్రలు, జోలపాటలు, స్వామివారి పూజా విధానంతోపాటు రాసిన అనేక రచనలు సాహితీప్రియులను అలరిస్తున్నాయి. విలువైన సమాచారంతో కూడిన ’సాంద్రానంద’ మాసపత్రికను కొన్ని సంవత్సరాలపాటు నిర్వహించారు.
వివిధ ప్రాంతాలలో నడయాడిన దత్తస్వరూపాలను స్తుతిస్తూ వీరు రచించిన అష్టకాలు నిత్యపారాయణ మంత్రాలైనాయి. ప్రాచీన ఋషుల స్తోత్రాలకు ఏమాత్రం తీసిపోని రచనా శైలి వీరిది. వీరి కవిత్వం సహజ ప్రతిభాయుతం. భక్తితోపాటు కవితా శక్తితో అనర్గళ ధారగా సాగే శ్రీ సాంద్రానందాష్టకంలోని ఒకశ్లోకం చూడండి..
శృతి స్మార్త కర్తవ్య నిష్ఠా గరిష్ఠం
లసన్మందహాసం కృపా పూర్ణభాసం
సదా దీనబంధుం మహా ప్రేమసింధుం
చిదానంద సాంద్రం భజే నారసింహం..
గోదావరీ తీరంలో బాసరలో వ్యాస ప్రతిష్ఠితమైన వీణాపుస్తకధారిణి శ్రీ శారదాంబ దివ్య రూపాన్ని దర్శించి, శ్రీమత్ శారద దివ్య రూపమహితాం ధ్యాయామ్యహం మానసే అనే మకుటంతో పదహారు శ్లోకాలతో ఆమెను తమ ఉపాస్యదైవంగా హృదయంలో నిలుపుకొన్నారు. శ్రీవిద్యా ఉపాసకులు అయిన శర్మగారు నవరాత్రి పూజలలో శ్రీ చక్రార్చన చేస్తూ అమ్మవారిని పది శ్లోకాలలో ధ్యానించారు. ఆ కోవ లోనిదే శ్రీ విద్యా స్తోత్ర తారామణి హారం. పూజాపునస్కారాలలో భక్తుల గొంతుల్లో వినిపించే వందలాది మంగళ హారతులను, అనేకానేక దేవతా స్తోత్రాలను అక్షరార్చనగా అందించిన శ్రీనాథ శర్మ గారికిదే స్మృత్యంజలి.
(విశ్రాంత ప్రధానాచార్యులు, రాష్ట్ర ప్రభుత్వగురుకుల విద్యాలయాల సంస్థ)
– మరుమాముల దత్తాత్రేయ శర్మ 9441039146